మహిళా సమాఖ్యలకు భవనాలు
రామన్నపేట : మహిళా స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. త్వరలోనే ఆ ఇబ్బందులు తీరనున్నాయి. ఊరూరా మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది.
స్థలాలను గుర్తించే పనిలో అధికారులు
జిల్లాలో 14,956 స్వయం సహాయక సంఘాలు, 561 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటిలో 1,58,501 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటితో పాటు 266 దివ్వాంగ సంఘాలు, వాటిలో 2,125 మంది సభ్యులు ఉన్నారు. ఉపాధిహామీ పథకం నిధులతో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించనున్నారు. 200 గజాల స్థలంలో కనీసం 552 చదరపు అడుగుల విస్తీర్ణణంలో వీటిని నిర్మించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థలాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 256 గ్రామాల్లో అనువైన స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. స్థలాల గుర్తింపు రెండుమూడు రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామ సభలో తీర్మానం
● స్థలాల గుర్తింపు పూర్తయిన తరువాత మహిళా సమాఖ్యలు భవన నిర్మాణం కోసం తీర్మానం చేసి గ్రామ పంచాయతీకి సమర్పిస్తారు. గ్రామసభలో తీర్మానం, ఎంపీడీఓ ప్రతిపాదన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల తనిఖీ అనంతరం భవన నిర్మాణానికి కలెక్టర్ పరిపాలన పరమైన అనుమతులను ఇస్తారు.
● భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించే అవకాశం ఉంది.
‘ఉపాధి’ నిధులతో ఊరూరా సొంత భవనాల నిర్మాణం
రూ.10 లక్షల చొప్పున మంజూరు
జిల్లాలో 561 గ్రామ సమాఖ్యలు
256 గ్రామాల్లో స్థలాల గుర్తింపు
రెండు రోజుల్లో అన్ని గ్రామాల్లోస్థలాల గుర్తింపు పూర్తి
మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి 256 గ్రామాల్లో స్థలాలు గుర్తించాం. మిగతా చోట్ల కూడా ఒకటి రెండురోజుల్లో పూర్తవుతుంది. ప్రభుత్వ నిర్ణయం మహిళా సమాఖ్యలకు శుభ సూచకం. మహిళా సాధికారత, చైతన్యం, ఆత్మగౌరవం పెంపొందించే కేంద్రాలుగా భవనాలు విలసిల్లుతాయి.
– నాగిరెడ్డి, డీఆర్‌డీఓ


