సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి
కోదాడరూరల్: సౌదీఅరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని కౌసర్‌నగర్‌కు చెందిన షేక్ తాజుద్దీన్(49) ఉపాధి కోసం పదేళ్ల కిందట సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడ దమామ్ పట్టణంలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. నెల రోజుల క్రితం సౌదీఅరేబియాలో తనకు పరిచయం ఉన్న కపిల్ పేరు మీద తాజుద్దీన్ లైసెన్స్ తీసుకొని కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత షాపు లైసెన్స్ తన పేరు మీద ఉంది కావును షాపును తనకు అప్పగించి వెళ్లిపోవాలని కపిల్ తాజుద్దీన్‌ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన తాజుద్దీన్ అనుమానాస్పదస్థితిలో కాలిపోయి చావుబతుకుల మధ్య ఉంటే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తాజుద్దీన్ మృతిచెందినట్లు అతడి స్నేహితులు ఫోన్ చేసి తాజుద్దీన్ కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాజుద్దీన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్చి 3న అక్కడకు వెళ్లి..
జనవరి 6న తాజుద్దీన్, అతడి భార్య షాజహాన్ కలిసి ఇండియాకు వచ్చారు. మార్చి 3న తిరిగి సౌదీఅరేబియాకు వెళ్లి రూ.10లక్షల అప్పులు తీసుకొచ్చి కూరగాయల షాపు పెట్టినట్లు తాజుద్దీన్ భార్య తెలిపారు. షాపు పెట్టిన తర్వాత కపిల్ షాపు తనకు అప్పగించాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు.


