ఆర్‌పీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందకు గాను ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్ పర్సన్ల(ఆర్‌పీ) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు నమూనా ఫారంలో పూర్తిచేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 24న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు. వివరాల కోసం కో ఆర్డినేటర్ సెల్ నంబర్ 98487 07758ను సంప్రదించాలని కోరారు.
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీదళ, సహస్ర నామార్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.
నారాయణపురం@43.1
భువనగిరిటౌన్ : ఎండలు మండిపోతున్నాయి.ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరడంతో జనం ఎండ వేడిమిని తాళలేకపోతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదవుతుండడమే దీనికి నిదర్శనం. బుధవారం అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురంలో 43.1, రామన్నపేటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత గుండాల 42.5, రాజాపేట 42.4, వలిగొండ 42.4, మోత్కూరు 42.2, చౌటుప్పల్ 42.2, ఆలేరు 42.0, అడ్డగూడూరు 42.0, ఆత్మకూర్(ఎం) లో 42 డిగ్రీలుగా నమోదైంది. ఎండనుంచి ఉపశమనం పొందడానికి గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. జిల్లాను వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్‌గా ప్రకటించింది.
ఆర్‌పీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం


