కట్ట రూ.100 పైనే..
ప్రభుత్వం సరఫరా చేయాలి
● జిల్లాలో 90 శాతం సార్వా పంటకు నష్టం
● చేలల్లోనే కుళ్లిపోతున్న పంట, గడ్డి
● పశుగ్రాసానికి తీవ్ర కొరత
భీమవరం: జిల్లాలో వరుస తుపాన్ల కారణంగా రైతులు సార్వా పంటను కోల్పోవడమే కాకుండా వరి గడ్డి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన ఈ ప్రాంతంలో వరి సాగుతో పాటు పాడి పశువుల పెంపకంపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు పాడి ద్వారా వచ్చే ఆదాయమే వారికి ఆసరాగా నిలుస్తుంది. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.24 లక్షల పశువులు, మరో 25 వేల వరకు మేకలు, గొర్రెలు ఉన్నాయి. వీటి పోషణకు రైతులు ప్రధానంగా వరి ఎండుగడ్డినే ఆధారంగా చేసుకుంటున్నారు.
సార్వా గడ్డికే అధిక ప్రాధాన్యం
జిల్లాలో సార్వా, దాళ్వా సీజన్లలో వరి పండిస్తున్నా, పశుగ్రాసంగా సార్వా వరి గడ్డికే రైతులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. సార్వా కాలంలో ఎరువులు, పురుగు మందుల వాడకం తక్కువగా ఉండటం వల్ల ఆ గడ్డి పశువుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. దీనిని కట్టలు కట్టి, వాములుగా పేర్చుకుని ఏడాది పొడవునా వినియోగిస్తారు. అవసరాన్ని బట్టి పచ్చగడ్డి, దాణా కూడా కలిపి మేపుతారు. అయితే, ఇటీవల కోత యంత్రాలతో వరి కోస్తుండటంతో గడ్డి ముక్కలుగా మారి పోగులుగా పడుతోంది. దీంతో దానిని ఆరబెట్టి, కట్టలు కట్టి, ట్రాక్టర్లపై తరలించి వాములు వేయడం రైతులకు శ్రమతో పాటు ఖర్చుతో కూడిన పనిగా మారింది.
చేలలోనే కుళ్లిపోయిన పంట
జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు కాగా, అక్టోబర్‌లో అర్నాబ్, నవంబర్‌లో మురసు తుపాన్ల ధాటికి దాదాపు 90 శాతం పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అనేక చోట్ల చేలు ఇంకా ముంపులోనే ఉండటంతో ధాన్యంతో పాటు వరి గడ్డి కూడా కుళ్లిపోతోంది. మిగిలిన కొద్దిపాటి పంటనైనా కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం, వరి కోతల వల్ల కూలీలకు డిమాండ్ పెరిగింది. కోత యంత్రాల వినియోగంతో గడ్డిని ప్రత్యేకంగా కూలీలతో గట్టుకు చేర్చాల్సి వస్తోంది. ఫలితంగా గతంలో రూ.50కి లభించే ఎండుగడ్డి కట్ట ధర ఇప్పుడు రూ.100 దాటినా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు దాణా ధరలు కూడా పెరగడంతో పశువుల పోషణ భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండుగడ్డికి తీవ్ర కొరత ఏర్పడింది. వరి చేలలోని మురుగునీరు పారకపోవడంతో పంటతోపాటు గడ్డి కూడా కుళ్లిపోయింది. దీనితో ఎండు గడ్డికి గిరాకీ ఏర్పడి కట్ట రూ.100 పెట్టినా దొరికే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో దాళ్వా పంట చేతికి వచ్చే వరకూ పశువులను పోషించడం కష్టమే.
–ఆర్.మాణిక్యాలరావు, పాడి రైతు, మోగల్లు
పశువులకు ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉంది. భారీ వర్షాలతో గతంలో వేసుకున్న గడ్డివాములు సైతం తడిసి కుళ్లిపోయాయి. సార్వా పంట 90 శాతం వరకు దెబ్బతినడంతో ఎండుగడ్డి లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తెప్పించి రైతులకు అందించాలి.
– కోరుకొల్లు వెంకట్రావు, కంచుమర్రు


