ఏలూరు టౌన్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక వైపు నిర్మించిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని తెరవనీయకుండా కూటమి నాయకులు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా జిల్లా కార్యాలయ భవనానికి విద్యుత్ సర్వీస్ తొలగించటం, భవన గేట్లకు తాళాలు వేయడం వంటి కుట్రలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి న్యాయ పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ పార్టీ జిల్లా కార్యాలయ భవనానికి తాళాలు వేయటంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టు డబ్లూపీ నంబర్ 13427/2026తో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావుకు కొన్ని పత్రాలు సమర్పించాలంటూ ఈ నెల 11న నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవనానికి సంబంధించిన నిర్దేశిత పత్రాలను విద్యుత్ శాఖ ఎస్‌ఈకి సమర్పించారు. నిబంధనల మేరకే పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం జరిగిందనీ, గతంలో విద్యుత్ సర్వీస్‌ను ఇచ్చిన ఏపీఈపీడీసీఎల్ అధికారుల రాజకీయ ఒత్తిళ్లతో సర్వీస్ కట్ చేశారని గుర్తుచేశారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించామనీ, బకాయిలు ఏమీ లేవని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా యశ్వంత్, పార్టీ జిల్లా మేనేజర్ టి.వెంకటేశ్వర్లు ఉన్నారు.


