● ఉత్కంఠ పోరులో ఎవరి ధీమా వారిదే..
● కూటమికి క్రాస్ ఓటింగ్ బెడద
● 30న తేలనున్న భవితవ్యం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పురపాలక సంఘ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 30న వెలువడనున్న తుది ఫలితాలతో పురపాలక చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో తేలనుంది. గురువారం జరిగిన ఎన్నికల్లో 53,864 మంది ఓటు వేయగా 69.52 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 14 మంది చైర్‌పర్సన్ అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా ఆబోతుల ఉషారాణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చందక ఉమాశైలజ, టీడీపీ రెబల్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్నేన రోజారమణి పోటీ పడ్డారు.
టీడీపీపై ‘కత్తెర’ ప్రభావం
టీడీపీ అభ్యర్థి ఉషారాణి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలిచారు. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన అభివృద్ధి, భర్త జీవీ పరిచయాలు, పార్టీ మ్యాండెట్ తమను గెలిపిస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ప్రభావం పెద్దగా ఉండదని, దాదాపు 15 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
రెబల్ అభ్యర్థి గట్టి పోటీ
మరోవైపు కత్తెర గుర్తుపై పోటీ చేసిన రెబల్ అభ్యర్థి కర్నేన రోజారమణి గట్టి పోటీ ఇచ్చారు. అన్ని వర్గాలు, క్లబ్‌లు, మహిళా మిత్రుల నుంచి లోపాయి కారి మద్దతు లభించిందని ఆమె వర్గం చెబుతోంది. టీడీపీ కోసం కష్టపడిన రోజారమణిని కాదని, ఉ ద్యోగానికి రాజీనామా చేయించి కొత్తవారిని బరిలో దించడంపై కొన్ని బూత్‌ల వద్ద క్యూలైన్లలోనూ చర్చ జరిగింది. కూటమిపై నెలకొన్న వ్యతిరేకత, క్రాస్ ఓటింగ్ తమకు కలిసి వస్తాయని కత్తెర మద్దతుదారులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ధీమా
విలీన గ్రామాలు, లాకు సెంటర్ ప్రాంతంలోని పట్టు తమకు లాభిస్తాయని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అభ్యర్థి ఉమాశైలజతో పాటు ఆమె భర్త సత్తిబాబు, తాత అప్పలస్వామిలకు గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ ఓట్ల చీలికతో తమకు విజయావకాశాలు మెరుగయ్యాయని వైఎస్సార్‌సీపీ అంచనా వేస్తోంది. ప్రధాన పోటీదారులు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గ ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సైకిల్, ఫ్యాన్ మధ్యే పోటీ ఉంటుందని కూటమి నేతలు అంటున్నా, క్షేత్రస్థాయిలో కత్తెర ప్రభావం అనూ హ్యంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


