● కాలుష్య కాసారంలా వెంకయ్య వయ్యేరు
● కుళ్లిన వ్యర్థాలు, మురుగునీరు ప్రవాహం
● ముంపు ప్రాంతాల్లో అందని సాయం
ఆకివీడు/కాళ్ల: ఎగువ ప్రాంతాలకు మురుగు కాలువగా, దిగువ ప్రాంతాలకు సాగునీటి కాలువగా ఉన్న వెంకయ్య వయ్యేరు పంట కాలువ పూర్తిగా కలుషితమై మురుగు కూపంగా మారింది. ఎగువ నుంచి వచ్చే మురుగునీటికి, దిగువ ప్రాంతాల ముంపునీరు తోడవడంతో కాలువలోని నీరంతా నల్లగా మారి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజులుగా అల్పపీడనం, మురసు తుపాను భారీ వర్షాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి సహా ఇతర పంటలన్నీ నీటమునిగి కుళ్లిపోయాయి. తొలుత దువ్వ లాకుల వద్ద నుంచి వచ్చిన ఎర్రకాలువ నీరు బురదమయంగా ప్రవహించగా, రెండు రోజులకే మురుగునీరు కాలువలను ముంచెత్తింది. ఫలితంగా గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి ఈ కుళ్లిన నీరు చేరింది. ఇప్పుడు మంచినీటి చెరువుల్లోకి కూ డా మురుగునీరు కలిసే ప్రమాదం ఏర్పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో నిలిచిన మురుగునీటి వద్ద బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టినప్పటికీ, కుళ్లిన కంపు ఏ మాత్రం తగ్గడం లేదు.
నీరు కిందకు దిగదు.. ముంపు వదలదు : వారం రోజులుగా ముంపునీరు అంగుళం కూడా తగ్గకపోవడంతో దిగువ ప్రాంతాల పరిస్థితి అధ్వానంగా మారింది. నీరు పల్లమెరుగు అనే సామెత ఇక్కడ తలకిందులైంది. ఆకివీడు, కాళ్ల మండల్లాలోని పలు మీడియం, మైనర్ డ్రెయిన్లు పూడుకుపోవడంతో పాటు, ప్రధానమైన చినకాపవరం డ్రెయిన్ ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. దీంతో ఎగువ నుంచి వచ్చిన వరద నీరు బయటకు వెళ్లే దారిలేక గ్రామాల్లోనే తిష్టవేసింది. పల్లపు ప్రాంతాల ప్రజలు ముంపునీటిలోనే మగ్గిపోతున్నారు.
సహాయం కనుమరుగు
ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలి పనులు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, కనీసం బయటకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. కేవలం పది కిలోల బియ్యం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, నేటికీ నిత్యావసర సరుకులు సరఫరా చేయలేదని బాధితులు వాపోతున్నారు. పాలు, మంచినీళ్లు కూడా దొరకడం లేదని, మురుగునీటిలో తిరగడం వల్ల శరీరంపై, కాళ్లకు దురదలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, తాగునీరు సరఫరా చేసి ఆదుకోవాలని వారు మొరపెట్టుకుంటున్నారు.


