అధికారిక ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు?
అధికారుల వైఖరిపై విచారణ జరపాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచే వివాదాలు, ఆరోపణలు చుట్టుముట్టాయి. విధుల కేటాయింపులో అధికారులు తీవ్ర పక్షపాత ధోరణి ప్రదర్శించారని పలువురు సిబ్బంది బాహటంగానే విమర్శించారు. కింది స్థాయి అధికారులను రిటర్నింగ్ అధికారులుగా, పోలింగ్ అధికారులుగా నియమించి... వారికంటే ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని వారికి సహాయకులుగా కేటాయించి ఉద్దేశపూర్వకంగా అవమానించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అభ్యంతరాలను పట్టించుకోకుండానే ఎన్నికల ప్రక్రియ, ఆపై ఏలూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పలు మున్సిపాలిటీల కౌంటింగ్ తంతును ముగించేశారు. తాజాగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఏపీఓలు, ఓపీఓలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పారితోషికంలో తీవ్రంగా కోత విధించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తర్వులు ఒకలా... చెల్లింపులు మరోలా
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పారితోషికానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన జీఓను విడుదల చేసింది. ప్రిసైడింగ్ అధికారి / కౌంటింగ్ సూపర్ వైజర్ / మైక్రో అబ్జర్వర్‌కు రూ.2,000 స్టేజ్–1 ఆర్ఓ / పోలింగ్ ఆఫీసర్‌కు రూ.1,600, జోనల్, రూట్, సెక్టోరల్ ఆఫీసర్లకు రూ.1,500, ఆఫీస్ సబార్డినేట్‌కు రూ.1,400, కౌంటింగ్ అసిస్టెంట్‌కు రూ.1,350, స్టేజ్–1 ఏఆర్ఓ / స్టేజ్–2 ఆర్ఓకు రూ.1,000గా నిర్ణయించారు. అయితే ఏలూరు జిల్లాలో ఈ అధికారిక ఉత్తర్వులను అధికారులు పూర్తిగా పక్కనబెట్టారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీఓలు, ఓపీఓలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు చెల్లింపుల విషయంలో నిబంధనలను బేఖాతరు చేశారని మండిపడుతున్నారు.
రూ. 1,600కి సంతకాలు : ఏలూరు జిల్లాలోని 10 మండలాల్లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన 17 మండలాల్లో ఎన్నికల సిబ్బందికి తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని మండలాల్లో రూ.1,600 పారితోషికానికి గాను కేవలం రూ.800 మాత్రమే చెల్లించారు. మరికొన్ని మండలాల్లో రూ.1,600 ఇచ్చినట్లు సంతకాలు తీసుకుని, చేతికి మాత్రం రూ.800 మాత్రమే ఇచ్చారని సిబ్బంది తెలిపారు. చెల్లింపుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించగా, ఉన్నతాధికారులు చెప్పిన మొత్తాన్నే ఇస్తున్నాం అని సిబ్బందికి సమాధానమిచ్చారు. దీంతో చేసేదేమీ లేక కొందరు ఇచ్చిన మొత్తాన్ని తీసుకెళ్లగా, మరికొందరు నిరసనగా ఆ మొత్తాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ఈ అక్రమాలపై ఏలూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించడంలో ఏపీఓలు, ఓపీఓలు, ఆర్ఓలు కీలక పాత్ర పోషించారు. పారదర్శకంగా పనిచేసిన సిబ్బందికి అధికారులు ఇచ్చే మర్యాద ఇదేనా? ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పారితోషికంలో కోత విధించడం వెనుక ఎవరి హస్తముందో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.
– జి.మోహన్, ఫ్యాప్టో జిల్లా ౖచైర్మన్
జిల్లాలోని కొన్ని మండలాల్లో పూర్తి పారితోషికం ఇచ్చి, మరికొన్ని మండలాల్లో సగం మాత్రమే ఎందుకు చెల్లించారు? జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు ఉంటే చెల్లింపులు అన్ని మండలాల్లో ఒకేలా ఉండాలి. అలా జరగలేదంటే మండల స్థాయి అధికారులే అక్రమాలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. కలెక్టర్ దీనిపై విచారణ జరిపి, మిగిలిన మొత్తాన్ని అందరికీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
– తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం చెప్పింది రూ. 1600, చేతికి ఇచ్చింది రూ. 800
రూ. 1600 ఇచ్చినట్టు సంతకాలు
మిగిలిన మొత్తం ఏమైందనే ప్రశ్నలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన
ఉపాధ్యాయ సంఘాల నాయకులు


