భీమవరం: జిల్లాలో దాళ్వా సీజన్‌కు అవసరమైన వరి విత్తనాలను సిద్ధం చేసి, ఈ నెల 15లోపు నారుమళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో సార్వా వరి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ తరుణంలో దాళ్వా సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచి, ప్రధానంగా ఎంటీయు–1120 రకం విత్తనాలను సరఫరా చేయాలని సూచించారు. తుపానుకు దెబ్బతిన్న వరి పంటలకు సంబంధించి క్రాప్ కటింగ్ ప్రయోగాలను వేగవంతంగా పూర్తి చేసి, రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 254 గ్రామాల్లో క్రాప్ కటింగ్ ప్రయోగాలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 18 గ్రామాల్లో మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. సునీత, సీపీఓ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వ అరాచకాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో ఈ నిరసనలు నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల ప్రక్రియలో ప్రజల స్వేచ్ఛాయుత భాగస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వామపక్షాలు తలపెట్టిన ఈ నిరసనల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డి–ఫారం భూములు తదితర అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజుల్లోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ జ్యోతిలతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి–ఫారం భూముల సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పించామన్నారు. కమిటీ పరిశీలన అనంతరం కోరిన అదనపు సమాచారాన్ని, మ్యాప్‌లను త్వరగా అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, కే.ఆర్. కల్పశ్రీ, డీఎఫ్‌ఓలు సందీప్ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీపీఓ మల్లికార్జునరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కే.ఎం. అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ స్థాయిలో త్వరలో జరగనున్న సివిల్ సర్వీసెస్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఎంపిక చేశారు. శాప్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఎంపికలకు 30 మంది క్రీడాకారులు హాజరుకాగా, వారిలో 22 మందితో ప్రధాన జట్టును, మరో ఇద్దరిని స్టాండ్‌బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు.


