● ఎంపీటీసీ ఫలితాల తర్వాత రగులుతున్న విభేదాలు
● తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైట్‌కు సిద్ధమని వలవల బాబ్జీ స్పష్టీకరణ
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పత్సా రామచంద్రయ్య విజయం సాధించడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమిలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. కూటమి నేతల మధ్య అసమ్మతి సెగలు కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. నాయకులు పరస్పర ఆరోపణలు, విశ్లేషణల్లో మునిగిపోయారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్, రూరల్ ఎస్సైల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయని, సదరు ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడి ద్వారా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వలవల బాబ్జి తెలిపారు. కూటమిలో ఉన్నప్పటికీ పదవుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్ల కేటాయింపులోనూ టీడీపీ ప్రాతినిధ్యానికి విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలో ఫ్రెండ్లీ పోటీకి సై
కూటమిలో ఎదురవుతున్న అవమానాలను ఇకపై భరించలేమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైట్‌కై నా సిద్ధపడతామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు ముందు బాబ్జి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ కౌన్సిలర్ గొర్రెల శ్రీధర్‌ను టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గ రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
నాకేమీ సంబంధం లేదు: ఎమ్మెల్యే బొలిశెట్టి
వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ ఫలితంపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన ఎన్నికల కమిషన్ వింటుందా? కూటమి ధర్మం ప్రకారమే సీటు కేటాయించాం. నేను ఒక్క పోలింగ్ బూత్‌లోకి కూడా వెళ్లలేదు. ఈ ఫలితాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. దీనివల్ల కూటమికి ఎటువంటి ఢోకా ఉండదని, అధిష్టానం తీసుకునే నిర్ణయాల ప్రాతిపదికన కూటమి ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని రాబోయే ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే నియోజకవర్గంలో కూటమి పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


