రీ కౌంటింగ్ లీలలు
సాక్షి, భీమవరం : పరిషత్ ఎన్నికల్లో విజయం కోసం కౌంటింగ్‌లోనూ కూటమి కుట్ర రాజకీయాలు చేసింది. రూ.కోట్లు కుమ్మరించి మద్యాన్ని ఏరులై పారించినా ప్రజల్లో వ్యతిరేకత ముందు పాచికలు పారక అధికార బలంతో పలుచోట్ల ఫలితాలను తారుమారు చేసింది. ఎన్ని పన్నాగాలు పన్నినా విపక్ష వైఎస్సార్‌సీపీకి ప్రజలు అండగా నిలిచారు. 36 ఎంపీటీసీ స్థానాల్లో విజయాన్ని అందించారు.
కుట్రలు చేధించుకుని..
స్థానిక సంస్థల్లో ఓటమి భయంతో గతంలో ఎన్నడూలేని విష సంస్కృతికి కూటమి బీజం వేసింది. నామినేషన్ల ఉపసంహరణకు విపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అన్ని అస్త్రాలను ప్రయోగించింది. వారి వేధింపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు విచ్చలవిడిగా రూ.కోట్లల్లో డబ్బు ఖర్చుచేశారు. మద్యాన్ని ఏరులై పారించారు. అయినా జిల్లాలో 36 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు స్వగ్రామమైన ఉండి నియోజకవర్గం కలవపూడిలో ఎంపీటీసీ సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొడ్డు దుర్గ 91 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
కూటమికి గట్టిపోటీ
కూటమికి జిల్లాలో చాలాచోట్ల గట్టిపోటీ ఎదురైంది. మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం పాలకొల్లులోని జిన్నూరు–1లో నాలుగు, ఆగర్రులో ఐదు, చించినాడలో తొమ్మిది, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కడియద్దలో కేవలం ఒకే ఒక్క ఓటు, కొండేపాడులో ఐదు ఓట్లు, పెనుమంట్ర మండలం మార్టేరు–2 ఆరు ఓట్లు.. ఇలా మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు వంద లోపు ఆధిక్యంతో గెలుపొందడం వైఎస్సార్‌సీపీ నుంచి వారికి ఎదురైన గట్టి పోటీ, ప్రజల్లోని వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు అంటున్నారు.
ఫలితం తారుమారు
తాడేపల్లిగూడెం రూరల్ కడియద్ద ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండపల్లి నాగలక్ష్మికి ఒక్క ఓటు ఆధిక్యత వచ్చింది. కూటమి నాయకులు అభ్యంతరం తెలపడంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అప్పుడు ఒక్క ఓటు మెజార్టీ రావడంతో ఫలితం ప్రకటించకుండా కూటమి నాయకులు అ డ్డుపడటంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మరలా పరిశీలనలో ఒక్క ఓటు ఆధిక్యతతో కూటమి అభ్యర్థి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు ఆందోళనకు దిగగా పోలీసులు బయటకు పంపించివేశారు. పెనుమంట్ర మండలం మల్లిపూడిలో వైఎస్సార్‌సీపీ, కూటమి అభ్యర్థికి సమానంగా రావడంతో విజేతను ప్రకటించేందుకు టాస్ వేయాలని అధికారులు నిర్ణయించారు. కూట మి రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొడమంచిలి సరోజనికి పోలైన ఓట్లలో ఒకటి చిరిగినట్టుగా చూపించి కూటమి అభ్యర్థి విజేతగా ప్రకటించడం గమనార్హం.
ఫలితాలను తారుమారు చేస్తూ కౌంటింగ్‌లోనూ కూటమి కుట్రలు
గట్టిపోటీనిచ్చిన వైఎస్సార్‌సీపీ
36 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
మెజార్టీ స్థానాల్లో బొటాబొటీ ఆధిక్యంతో కూటమి గెలుపు
రాత్రి 11 గంటలు దాటినా కొనసాగిన కౌంటింగ్
పాలకొల్లు రూరల్ లంకలకోడేరు–2 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంజే సువార్త 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కూటమి నాయకులు పట్టుబట్టడంతో రీకౌంటింగ్ చేశారు. ఆధిక్యం 9 ఓట్లకు తగ్గించగా మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కూటమి పక్షం పట్టుబట్టింది. అంతకంటే తక్కువ ఓట్లుతో కూటమి అభ్యర్థులు గెలుపొందిన స్థానాల్లో రీ కౌంటింగ్‌లు చేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచిన చోట రెండోసారి రీకౌంటింగ్ ఎలా చేస్తారని మీడియా ప్రశ్నించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. చివరకు ఇంజే సువార్త గెలుపొందినట్టు ప్రకటించారు. తాడేపల్లిగూడెం రూరల్ వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో తాము గెలిచినట్టుగా కూటమి నాయకులు కేరింతలు కొట్టడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పత్సా రామచంద్రయ్య అనుమానం వ్యక్తంచేశారు. ఇన్‌వాలిడ్ ఓట్లను కూటమి అభ్యర్థికి కలిపినట్టు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. అందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. కూటమి అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో అభ్యర్థులిద్దరూ నేరుగా మరోసారి బాలెట్ పత్రాలను పరిశీలించే అవకాశాన్ని ఎన్నికల అధికారులు ఇచ్చారు. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు. జగన్నాథపురం–2 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రా తాల సూరిబాబు 36 ఓట్లతో గెలుపొందగా కూటమి నేతలు పట్టుబట్టగా రీ కౌంటింగ్‌లో నూ విజయం ఆయన్నే వరించింది.


