భీమవరం : భీమవరం పట్టణానికి యనమదుర్రు కాలువ ముంపు ముప్పు తొలగలేదు. కాలువ గట్లు వెంబడి నీరు ప్రవహించడంతో బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పర్చే చర్యలు చేపట్టారు. ప్రధానంగా పట్టణంలోని మెంటేవారితోట, దుర్గాపురం, యనమదుర్రు రోడ్డులోని గంగానమ్మగుడి ఏరియాల్లోని పల్లపు ప్రాంతాల్లో నివాసాల వద్దకు నీరు చేరడంతో ఆయిల్ ఇంజన్స్, విద్యుత్ మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ఆయిల్ ఇంజన్‌తో తోడుతున్నారు. యనమదుర్రు రోడ్డులోని యనమదుర్రు కాలువపై నిర్మించిన వంతెన వద్ద గట్టు బలహీనంగా ఉండటంతో ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు. మెంటవారితోటలో పలు వీధులు జలమయమయ్యాయి. హిందూ శ్మశాన వాటిక వద్ద ఇళ్లలోకి నీరు చేరడంతో బకెట్లతో బయటకు తోడుకుంటున్నారు.
కాలువల నిండా ప్లాస్టిక్ వ్యర్థాలే..
ముంపు నీరు కారణంగా పట్టణంలోని కాలువలు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో కాలువలు, డ్రెయిన్లు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. మెంటేవారితోట ప్రాంతంలోని లక్ష్మీటాకీస్ ఏరియాలోని రైల్వే అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడంతో ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. యనమదుర్రు కాలువలలో నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోందని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. మురుగునీటి ఇబ్బందులతోపాటు దుర్గంధం వెదజల్లి ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందని మున్సిపల్ అధికారులు ముంపు ప్రాంతాల్లో బ్లీచింగ్ జల్లి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


