జిల్లాలోని 20 జెడ్పీటీసీ, 340 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్, నరసాపురం వైఎన్ కళాశాల, తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. మూడు కేంద్రాల్లోను మొత్తం 230 టేబుళ్లపై ఓట్లు లెక్కింపు చేశారు. జెడ్పీటీసీలకు సంబంధించి 1,830 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు 160 ఓట్లు చెల్లనివి కాగా మిగిలిన వాటిలో వైఎస్సార్‌సీపీకి 442, కూటమి పక్షాలకు 1,156, కాంగ్రెస్‌కు 31, సీపీఐ (ఎం)కు 61, స్వతంత్రులకు ఆరు, బీఎస్‌పీకీ ఐదు, నోటాకు 23 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్ బాక్సులను తెరిచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లను వేరుచేసిన అనంతరం వాటిని కట్టలు కట్టి కౌంటింగ్ ప్రారంభించే సరికి 11 గంటల సమయం దాటిపోయింది. 12 గంటల తర్వాత నుంచి ఫలితాలు వెలువడటం మొదలైంది.


