విద్యార్థుల ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆటో బోల్తా

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

● అదుపుతప్పి మురుగు కాలువలోకి..

● 15 మంది సురక్షితం.. ఒకరికి అస్వస్థత

తణుకు అర్బన్‌ : విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి మురుగు కాలువలోకి బోల్తా కొట్టిన ఘటన మండలంలోని కొమరవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తణుకులో ఒక ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో కొమరవరం వంతెన ప్రాంతంలోని వనుమలమ్మ ఆలయ సమీపంలో అదుపుతప్పి మురుగు కాలువలో బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్న 16 మంది విద్యార్థుల్లో 15 మంది సురక్షితంగా బ యటపడ్డారు. 6వ తరగతి చదువుతున్న యర్రాయిచెరువుకు చెందిన బాలుడు కె.శ్రీధర్‌ అస్వస్థత కాగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడు నాలుక కరచుకోవడంతోపాటు కాలువలోని నీరు తాగడంతో ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. యర్రాయిచెరువుకు చెందిన ఆటో డ్రైవర్‌ కట్టా ఆంజనేయులు స్వల్ప గాయాలతో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డుపై ఆకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పినట్టు డ్రైవర్‌ చెబుతున్నారు. పిల్లలంతా కొమరవరం, యర్రాయిచెరువుకు చెందిన వారుగా తెలిసింది.

సకాలంలో స్పందించిన స్థానికులు

ప్రమాదం జరిగిన వెంటనే పిల్లల అరుపులతో ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. స్థానికులు హుటాహుటిన స్పందించి మురుగు కాలువలోకి దిగి 16 మంది పిల్లలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో స్థానికులు అందుబాటులో ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందగా.. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంపై ఫిర్యాదు అందలేదని రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement