కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కరెంట్ షాక్ తగిలి పలివెల కిషోర్‌కుమార్ (38) అనే యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం స్థానిక 10వ వార్డు ఎంబెరుమన్నార్ పేటలో విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేస్తుండగా, కిషోర్ వారికి సహాయపడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ పోల్‌ను ఎత్తుతుండగా, పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు పోల్‌కు తగిలాయి. దీంతో కిషోర్‌కు తీవ్ర విద్యుత్ షాక్ తగలగా, పోల్‌పై ఉన్న మరో వ్యక్తి కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కిషోర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కిషోర్‌కు ఇటీవలె వివాహం కాగా, ఆయన భార్య ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న కిషోర్.. వ్యక్తిగత పని మీద పాలకొల్లు వచ్చినట్లు తెలిపారు.
పాలకోడేరు: భీమవరం ప్రోహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి.బసంతి తెలిపారు. నిందితుని వద్ద నుంచి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్సైలు పి.ఉమామహేశ్వర రావు, పి.సునీల్ కుమార్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: స్థానిక ఎన్నికల ప్రభావం చినవెంకన్న క్షేత్రంపై కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే ద్వారకాతిరుమల శ్రీవారి దివ్యక్షేత్రానికి ఈ వారం భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు కొంత వెలవెలబోయాయి. మరోవైపు, ప్రతి వారం 100కు పైగా జంటలతో నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణంలో ఈసారి కేవలం 65 జంటలే పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం కూడా రద్దీ తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


