ఆగిరిపల్లి: మండలంలోని ఎస్ఏపేటలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి, దాని కింద చిక్కుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి: శోభనాపురం గ్రామానికి చెందిన దాసరి గోపికృష్ణ (38) విజయవాడలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే గురువారం విధులకు వెళ్లిన ఆయన, రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన వారు గోపికృష్ణ కోసం గాలించగా.. శనివారం ఉదయం ఎస్ఏపేట సమీపంలో బీర్ల లారీ బోల్తా పడిన ప్రాంతంలో ఆయన హెల్మెట్ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో లారీని పైకి లేపగా.. దాని కింద ద్విచక్ర వాహనంతో పాటు గోపికృష్ణ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య దాసరి పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపికృష్ణ అకస్మిక మృతితో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.


