మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు
పెనుమంట్ర: కౌలు రైతులను తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండలంలోని సోమరాజు ఇల్లిందలపర్రు లాకు నుంచి మాముడూరు లాకుల వరకు గోస్తనీ డ్రెయిన్ ముంపు ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి రైతులను, తుపాను బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తుపాను కారణంగా రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారని, ఇందులో అధిక శాతం కౌలు, సన్న, చిన్నకారు రైతులు ఉన్నారని తెలిపారు. వారిని తక్షణం ఆదుకోవాలని అయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, రైతుకు ఉచిత బీమా లేదని ఎల్‌నినో ప్రభావం తెగులు, ఎలుకలు, వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, మండల పార్టీ అధ్యక్షుడు గూడూరి దేవేంద్రుడు, భోగిరెడ్డి మారుతీ, దాట్ల చింటి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఎంపీటీసీ అభ్యర్థి పాలా హేమ శిరీష ఉన్నారు.
భీమవరం: జిల్లాలోని నరసాపురం మున్సిపా లిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఆదివారం జరుగుతున్న ఎన్నికల నిమిత్తం ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి తెలిపారు. నరసాపురంలో 36 వార్డులకు గాను 9 రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేసి, 250 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. అలాగే ఆకివీడులో 28 వార్డులకు 7 రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేసి, 200 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు కేటాయించారు. అదనపు బలగాలతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్ ): పశ్చిమగోదావరి జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వివిధ రంగాల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం (ఇంటర్ మినిస్ట్రియల్ టీమ్) ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ (సిడబ్ల్యూసి) డైరెక్టర్ ఎన్.వి. సతీష్ సీమకుమారి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేయనుందని వివరించారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య శాఖ, రోడ్డు భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గృహ నిర్మాణం తదితర మౌలిక వసతులకు జరిగిన నష్టాలను ఈ బృందం పరిశీలించి, తుపాను సమయంలో చేపట్టిన చర్యలను తెలుసుకుంటుందని పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు ఆదేశాల మేరకు, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు బాదంపూడి గ్రామంలో దెబ్బతిన్న బొప్పాయి తోటలను పరిశీలించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. తోటల నుంచి తక్షణమే నిల్వ నీటిని బయటకు పంపాలని, వేరుకుళ్ళు నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల రిడోమిల్ పిచికారీ చేయాలని తెలిపారు. వైరస్ సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలని, మొక్కలు కోలుకోవడానికి జింక్ సల్ఫేట్, బోరాన్, యూరియా మిశ్రమాన్ని పిచికారీ చేయడంతో పాటు పడిపోయిన మొక్కలకు ఆధారం కల్పించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రూత్, డీన్ ప్రసన్నకుమార్, డాక్టర్ ఎన్.వి.వి. చలపతిరావు, ప్రొఫెసర్లు కరుణశ్రీ, నాగలక్ష్మి, చెన్నకేశవులు, ఎం. రాఘవేంద్ర రెడ్డి, శిరీష, డాక్టర్ రేఖ, దేవి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.


