అర్నబ్ భీకర తుపాను ధాటికి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం కాకపోవడంతో గత నాలుగు రోజులుగా ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు తిరగక రొయ్యలకు ఆక్సిజన్ కొరత తలెత్తి అవి చనిపోతున్నాయి. రైతుల అత్యవసర పరిస్థితిని అదునుగా తీసుకుని రొయ్యల వ్యాపారులు ధరలను విపరీతంగా తగ్గించేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 60 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.360 ఉండగా, ప్రస్తుతం వ్యాపారులు రూ.290 మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. విద్యుత్ లేకపోవడంతో రొయ్యల నిల్వకు ఉపయోగించే ఐస్ కొరత కూడా తీవ్రమై రవాణా కష్టంగా మారింది. దీంతో చేసేదేమీ లేక వ్యాపారులు అడిగిన తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీమవరం : అర్నబ్ తుపాను సృష్టించిన భీభత్సం నుంచి జిల్లా ఇంకా కోలుకోలేదు. తుపాను తీవ్రతకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కూలిపోవడంతో ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉన్నా కనీసం జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటల్లోనే పునరుద్ధరణ పూర్తి చేస్తామని ప్రకటించిన మంత్రి, 72 గంటలు గడిచినా దాన్ని అమలు చేయలేకపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూలిపోయిన 3,700 స్తంభాలు
ఈ నెల 27న రాత్రి విరుచుకుపడిన అర్నబ్ తుపానుకు జిల్లా అతలాకుతలమైంది. సుమారు 400 గ్రామాలు, పట్టణాల్లో కలిపి 3,700కు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాన్ వచ్చిన మొదట్లోనే ఇళ్లలోని ఇన్వర్టర్లు రెండు రోజుల పాటు పనిచేసినా, ఆ తర్వాత అవి కూడా చార్జింగ్ లేక ఆగిపోవడంతో జనజీవనం స్తంభించింది. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.
వీఐపీ ప్రాంతాలకే ప్రాధాన్యం?
భీమవరం పట్టణంలోని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నివాసం ఉండే నర్సయ్య అగ్రహారంలో బుధవారం రాత్రికే యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించారు. మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయానికి అరకొరగా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అయితే పట్టణంలోని మెజారిటీ ప్రాంతాల్లో పడిపోయిన స్తంభాలు ఎక్కడివక్కడే దర్శనమిస్తున్నాయని, అధికారుల జాడే లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారానికే పరిమితమైన అదనపు సిబ్బంది
విద్యుత్ సరఫరా సత్వరం పునరుద్ధరించేందుకు రాష్ట్రం నుంచి 1,700 మంది, తెలంగాణ నుంచి మరో 500 మంది అదనపు సిబ్బందిని రప్పించినట్లు మంత్రి ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపించడం లేదు. గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో రెండు మూడు రోజులు పడుతుందని ఆ శాఖ సిబ్బందే చెబుతుండటంతో, ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని ప్రజలు మండిపడుతున్నారు.
చుక్కనీటికి అల్లాడుతున్న జనం
విద్యుత్ లేకపోవడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్ల సహాయంతో అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణాల్లో ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లు మూతపడటంతో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛంద సంస్థలు జనరేటర్ల సాయంతో ఆర్వో ప్లాంట్లను నడిపి ఉచితంగా మంచినీటిని అందిస్తున్నాయి.
‘అర్నబ్’ ధాటికి అంధకారంలోనే జిల్లా
24 గంటల్లోనే పరిష్కారమంటూ మంత్రి హడావుడి
72 గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించని వైనం


