చెల్లింపులు ఇంకా జరపలేదు
లీగల్ ఒపీనియన్‌పై అనుమానాలు
అధికారుల దాటవేత ధోరణి
2022 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు మంగళగిరికి చెందిన ‘సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించింది. టెండర్ నిబంధనల ప్రకారం యూనిట్ మేనేజర్, సూపర్‌వైజర్లు ఆరుగురు, పురుష హౌస్‌కీపింగ్ సిబ్బంది 35 మంది, మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బంది 70 మంది, మెషీన్ ఆపరేటర్లు ఇద్దరు, స్కావెంజర్లు 18 మంది ఇలా మొత్తం 132 మంది రోజువారీగా పనిచేయాల్సి ఉంది. వీరందరితో పూర్తి పనిదినాలు పనిచేయిస్తేనే జీఎస్‌టీతో కలిపి నెలకు రూ.18,28,716 కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ షరతుల ప్రకారం కాంట్రాక్టర్ కార్మిక చట్టాలకు లోబడి సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి ఖాతాల్లో పీఎఫ్ సొమ్ము జమ చేసిన తర్వాతే దేవస్థానం బిల్లులు చెల్లించాలి. కానీ అప్పట్లో 132 మందికి బదులు 80 నుండి 90 మందితోనే రెండు షిఫ్టుల్లో పనులు పూర్తి చేశారు. సుమారు 50 మందికి సంబంధించిన వేతనాలు పక్కదారి పట్టాయని కార్మికులు ఆరోపించారు.
ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానంలో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టర్‌కు నిలిపివేసిన పెండింగ్ సొమ్మును ఎలాగైనా చెల్లించేందుకు అధికారులు మళ్లీ ఫైల్‌ను తెరమీదకు తెచ్చారు. గతంలో టెండర్ షరతుల ప్రకారం 132 మంది సిబ్బందితో మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాల్సి ఉండగా.. 80 నుండి 90 మందితోనే రెండు షిఫ్టుల్లో పనులు చేయించి మమ అనిపించారు. నెలంతా పనిచేసిన వారికి అర్హత ఉన్నంత జీతం ఇవ్వకుండా, పీఎఫ్ సొమ్ములోనూ కోత పెట్టారు. రోజుకు 12 గంటల వరకు పనిచేయించినా ఓటీలు (ఓవర్ టైం) చెల్లించలేదు. 2022 నుండి 2025 సెప్టెంబర్ నెలాఖరు వరకు జరిగిన ఈ వ్యవహారంపై అప్పట్లో కార్మికులు సదరు కాంట్రాక్ట్ మేనేజర్‌ను పలుమార్లు నిలదీశారు. ఈ అక్రమాలపై ‘సాక్షి దినపత్రిక’లో 2024 ఆగస్టు 29 నుండి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి నివేదిక కోరగా.. 2024 అక్టోబర్‌లో దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈఎండీ 5 శాతం డిడక్షన్ నగదు కలిపి రూ.60 లక్షలకు పైగా సొమ్మును కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ నగదు చెల్లింపు విషయంలో కొందరు అధికారులు కాంట్రాక్టర్‌తో గూడుపుఠాణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పీఎఫ్ సొమ్ములోనూ అక్రమాలు
నెలకు ఒక్కో కార్మికుడికి సుమారు రూ.2,250 పీఎఫ్ జమ చేయాల్సి ఉండగా, ఖాతాలో రూ.1,160 మాత్రమే జమ చేశారు. దీంతో ఒక్కొక్కరు నెలకు రూ.1,090 నష్టపోయారు. మూడేళ్ల కాలంలో ఒక్కో కార్మికుడికి సుమారు రూ.75 వేల వరకు పీఎఫ్ అందాల్సి ఉండగా.. దాదాపు రూ.30 వేలు మాత్రమే లభించింది.
కలెక్టర్ నివేదికతో కదలిక..
నోరు విప్పితే ఎక్కడ ఉపాధి పోతుందోనని కార్మికులు సైలెంట్ అయ్యారు. అందుకే ఇప్పటికీ అధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదు చేయలేకపోయారు. ‘సాక్షి’ కథనాల ఆధారంగా జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో 2024 అక్టోబర్‌లో అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు చెందిన ఈఎండీ, 5 శాతం డిడక్షన్ మొత్తంగా రూ.60 లక్షలకు పైగా సొమ్ము ఏడాది పాటు నిలిచిపోయింది.
మళ్లీ తెరపైకి పెండింగ్ బిల్లులు : విషయం శాంతించిందని భావించిన కొందరు ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని మళ్లీ కదిపి కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆరోపణలు, నోటీసులను పక్కనబెట్టి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కార్మికులకు, దేవుడి సొమ్ముకు దిక్కెవరు?
లీగల్ ఒపీనియన్ పేరుతో కాంట్రాక్టర్‌కు సొమ్ము చెల్లిస్తే.. పీఎఫ్, ఓటీలు నష్టపోయిన పారిశుద్ధ్య కార్మికులకు, స్వాహా అయిన దేవుడి సొమ్ముకు బాధ్యులెవరు? అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.
నాలుగు రోజుల క్రితం కాంట్రాక్టర్ వచ్చి పెండింగ్ సొమ్ము కోసం వినతిపత్రంఇచ్చారు. లీగల్ ఒపీనియన్ కోసం ఫైలును పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి నగదు చెల్లింపులు జరపలేదు.
వేండ్ర త్రినాథరావును,
ఈఓ, ద్వారకాతిరుమల దేవస్థానం
కాంట్రాక్టర్ ఈనెల 23న వచ్చి మూడు రోజులపాటు స్థానికంగా ఉండి ఇంజనీరింగ్ విభాగ అధికారులతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఆ తర్వాతే ఫైలులో కదలిక రావడం అనుమానాలకు తావిస్తోంది. చెల్లింపుల కోసం లీగల్ ఒపీనియన్ కోరారని, అధికారులు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఒపీనియన్ తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి చేసిన చెల్లింపులపై లీగల్ ఒపీనియన్ తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
దేవస్థానం పరిధిలో 1,17,165 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 132 మందితో పారిశుద్ధ్య పనులు చేయించాలనేది నిబంధన. అయితే, తక్కువ మందితో పనులు చేయించినప్పుడు ‘సిబ్బంది సంఖ్యతో మాకు సంబంధం లేదు, నిర్ణీత విస్తీర్ణంలో పని జరిగిందో లేదో చూస్తాం’ అని ఇంజనీరింగ్ అధికారులు దాటవేశారు. అలాంటప్పుడు మ్యాన్‌పవర్‌ను టెండర్‌లో ఎందుకు పేర్కొన్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. కార్మిక చట్టాల అమలును టెండర్‌లో పొందుపరిచినప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
పెండింగ్ ఫైల్‌కు మళ్లీ పచ్చజెండా
చినవెంకన్న దేవస్థానంలో వివాదాస్పదంగా అధికారుల తీరు
గతంలో కాంట్రాక్టర్‌కు రూ.60 లక్షలకు పైగా చెల్లింపుల నిలిపివేత
మళ్లీ తెరపైకి వ్యవహారం


