ఆకివీడు: మండలంలోని అయిభీమవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు కనుమూరు కమలమ్మ తిరుమల తిరుపతి దేవస్థానానికి తమకున్న 54 సెంట్ల భూమిని విరాళంగా అందజేశారు. కమలమ్మ భర్త సూర్యనారాయణరాజు గతంలో మరణించారు. సంతానం లేకపోవడంతో ఒకరిని దత్తతు తీసుకోగా, ఆయన ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. దీంతో కమలమ్మ ఒక్కరే గ్రామంలో నివాసముంటున్నారు. తన తదనంతరం ఈ భూమిని స్వాధీనం చేసుకునేలా టీటీడీకి రాసిచ్చారు.సుమారు రూ.2.5 కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన కమలమ్మను మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు–అన్నపూర్ణమ్మ దంపతులు మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: మున్సిపాలిటీలో ప్రత్తిపాడు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, పడాల, కొండ్రుపోలు గ్రామాల విలీనానికి సంబంధించిన కేసు మంగళవారం హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. ఉదయం వేళ ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం తదుపరి వాదనలు జరగలేదు. దీంతో ఈ కేసులో బుధ లేదా గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని, కోర్టు వాయిదా వేస్తుందా? లేదా తుది తీర్పు వెలువరిస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
భీమవరం: శాంతిభద్రతల పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ, పారదర్శకమైన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రేవ్, నాన్–గ్రేవ్ కేసులతో పాటు ఎన్డీపీఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, మహిళలపై జరుగుతున్న నేరాల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, సమన్లు, ఎన్‌బీడబ్ల్యూల అమలులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డి.విశ్వనాథ్, డీఎస్పీలు రఘువీర్‌విష్ణు, ఎం.సుధాకర్, యు.రవిచంద్ర, పాల్గొన్నారు.
భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు 1,378 పాఠశాలల్లో ప్రశాంతంగా పూర్తయినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం జెడ్పీ స్కూల్, పోడూరు మండలం గుమ్ములూరు జెడ్పీ స్కూళ్లలో తల్లిదండ్రుల హాజరు కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఆ రెండు స్కూళ్లలో బుధ, గురువారాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దెందులూరు: కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ (బాలురు, బాలికలు) ఖో–ఖో పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్ల ఎంపికలు అక్టోబర్ 1న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖో–ఖో సంఘం చైర్మన్ ఈ.సాంబశివరావు తెలిపారు. తాళ్లపూడి మండలం మలకపల్లి ఎస్‌ఎంవీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 2008 డిసెంబర్ 1 తర్వాత జన్మించి, 18 ఏళ్ల లోపు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9491172325 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.


