సేవకు ఉరి.. పబ్లిసిటీకి సిరి | - | Sakshi
Sakshi News home page

సేవకు ఉరి.. పబ్లిసిటీకి సిరి

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

‘‘చంద్రబాబు గారు, పవన్‌ కళ్యాణ్‌ గారు చెప్పారు. వలంటీర్లకు ఇచ్చే రూ.5 వేలు దేనికీ సరిపోవు. మన ప్రభుత్వం రాగానే రూ.10 వేల జీతం ఇస్తాం. రేపొద్దున్న ‘అన్నయ్యా.. ఇదిగో రూ. 10 వేలు అందుకున్నాం’ అని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్‌ పట్టుకుని రావాలి.’’

– పాలకొల్లు ఎన్నికల ప్రచారంలో నిమ్మల రామానాయుడు

‘‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేము అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగం నుంచి తీయం. వ్యవస్థను కొనసాగించడమే కాకుండా, ఇచ్చే జీతాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతాం. ఆ బాధ్యత నాది.’’

– ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు

సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ చేరాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న వలంటీర్‌ వ్యవస్థపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని అట్టహాసంగా ప్రకటించిన కూటమి నేతలు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా పక్కనబెట్టేశారు.

కష్టకాలంలో బాసటగా నిలిచిన వ్యవస్థ

జిల్లాలో 8,820 మంది వలంటీర్లు నిస్వార్థంగా సేవలందించారు. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించడం, విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపుల్లో సహాయం చేయడం వంటి పనులతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారు. ముఖ్యంగా కోవిడ్‌ కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిత్యవసరాలు, మందులు పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌, పరీక్షల నిర్వహణలో వీరు అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వరదల సమయంలోనూ లంక గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బాధితులను ఆదుకున్నారు. నెలకు కేవలం రూ. 5 వేల గౌరవ వేతనంతో పనిచేసిన వలంటీర్లపై ఆ నాడు విషం చిమ్మిన కూటమి నేతలు, ఎన్నికల సమయంలో ప్రేమ ఒలకబోసి, అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టడంతో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోంది.

సెల్ఫ్‌ డబ్బాకు రూ.లక్షల పరితోషకం

వలంటీర్లకు రూ. 5 వేల వేతనం ఇస్తే ప్రజాధనం దుబారా అని విమర్శించిన చంద్రబాబు ‘సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల’ పేరిట కొత్త పాలసీ తీసుకొస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు రూ. 2,500 నుంచి రూ. 15,000 వరకు, నెలకు గరిష్టంగా ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 1.50 లక్షల వరకు చెల్లించేందుకు నిర్ణయించడం గమనార్హం. ఇది కేవలం అధికార పార్టీ శ్రేణులకు ప్రజాధనాన్ని దోచిపెట్టే ఎత్తుగడ అని ప్రజలు మండిపడుతున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి పథకాల అమలుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, సొంత ప్రచారం కోసం లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తుందని లబ్ధిదారులు నిలదీస్తున్నారు.

వలంటీర్ల కడుపు కొట్టి.. సొంత డప్పు కొట్టేవారికి రూ.లక్షల్లో జీతం

ఎన్నికల సమయంలో వలంటీర్లకు రూ.పదివేలు ఇస్తామని చంద్రబాబు హామీ

పూతరేకులు కానుకగా ఇవ్వాలని నిమ్మల ప్రచారం

అధికారంలోకి వచ్చాక వ్యవస్థకే మంగళం

కష్టపడ్డవారికి మోసం, సొంత ప్రచారానికి లక్షల నజరానా

ఐటీడీపీ కార్యకర్తలకు జనం సొమ్ము దోచిపెట్టే ఎత్తుగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement