● జెడ్పీ హైస్కూల్‌లో ముగ్గురు సభ్యుల ఎన్నిక
● అనంతరం నిలిచిన ఎన్నికల ప్రక్రియ
● బహిర్గతమైన కూటమి పార్టీల మధ్య విబేధాలు
ఉంగుటూరు: మండలంలోని కై కరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ ముగ్గురు సభ్యుల ఎంపిక తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో కూటమి పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి.
తాయిలాల పంపిణీ!
అంతర్గతంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని ఆంజనేయులు అనుంగు శిష్యుడు, మాజీ జెడ్పీటీసి చింతలవాసు వర్గం ఒకవైపు, స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అనుచరుడు, జనసేన నాయకుడు వెజ్జు సుబ్బారావు వర్గం మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ వర్గం రూ. 500 నగదు ఇస్తే, జనసేన వర్గం రూ. 500 నగదుతో పాటు చీరలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. వర్గ విబేధాలతో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు హైస్కూల్ రోడ్డు ప్రాంతంలో భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇరువర్గాల నాయకులు తెరవెనుక లాబీయింగ్ నడిపించడంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే ప్రధానోపాధ్యాయుడు చేబ్రోలు శ్రీనివాసరావు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.
నిలిచిన ఎన్నికల ప్రక్రియ
అంగవైకల్యం, ఎస్సీ, బీసీ కేటగిరీల నుంచి ముగ్గురు కమిటీ సభ్యులుగా సుభాష్ చంద్రబోస్, కొమరపు రాము, వెలగ కాశీ విశ్వనాథం ఎన్నికయ్యారు. ఎన్నికై న ఈ ముగ్గురూ టీడీపీ (చింతలవాసు) వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. నాలుగో కమిటీ సభ్యుడి ఎన్నిక కూడా టీడీపీకి అనుకూలంగా మారుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఎన్నికను నిలిపివేశారంటూ బహిరంగంగా చర్చించుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం 1:30 గంటలు కావడంతో సహనం కోల్పోయిన తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. సమీపంలోని నాగమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన భోజనాల వైపు వారు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం 7:30 గంటలకే ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకోగా, 9:30 గంటల నుంచి తల్లిదండ్రులు రావడం మొదలుపెట్టారు. మొత్తం 360 మంది ఓటర్లకు గాను సుమారు 190 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు.. 1:30 గంటల ప్రాంతంలో ముగ్గురు సభ్యుల ఎన్నిక తర్వాత నిలిచిపోయినట్లు హెచ్‌ఎం ప్రకటించారు. జనసేన నాయకుడి ప్రోద్బలంతోనే ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు ఆపేశారని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై ఏలూరు డీవైఈవో రవీంద్ర భారతిని వివరణ కోరగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా కొన్ని చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయని, ప్రభుత్వం మరో తేదీని ప్రకటిస్తుందని తెలిపారు. గణపవరం, భీమడోలు సీఐలు రజనీకుమార్, కృష్ణ, చేబ్రోలు, గణపవరం ఎస్సైలు సూర్యభగవాన్, మణికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. డీఎస్పీ శ్రావణ్‌రెడ్డి హైస్కూల్ ప్రాంతాన్ని పరిశీలించారు.


