దర్భగూడెంలో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

దర్భగూడెంలో వ్యక్తి హత్య

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

దర్భగూడెంలో వ్యక్తి హత్య మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ ఆత్మహత్య దస్తావేజు లేఖరి అనుమానాస్పద మృతి

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం బాపూజీ కాలనీలో పి.వెంకయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామ సమీపంలోని గుడి వద్ద నిద్రిస్తున్న ఆయనపై దుండగులు దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న వెంకయ్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలవరం డీఎస్పీ జయకృష్ణ, సీఐ యాదగిరి, ఎస్సై క్రాంతికుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి క్లూస్‌ సేకరిస్తూ, హత్యకుగల అసలు కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు వారు తెలిపారు.

పెంటపాడు: మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెంటపాడు ఏఎస్సై రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. వెలంపేటకు చెందిన అగ్గల సింహాద్రి (26) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, భార్యతో పాటు కుమారుడు అంకిత్‌ ఉన్నారు. పూర్తిగా మద్యానికి బానిసైన సింహాద్రి ఆ మత్తులో తరచూ భార్యను, కన్న తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టేవాడు. భర్త ప్రవర్తనను భరించలేక కొంతకాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, కుమారుడు పెంటపాడులోని సింహాద్రి సోదరి వద్ద ఉంటున్నాడు. అయినప్పటికీ సింహాద్రి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ఇంటివద్ద తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మను కూడా దుర్భాషలాడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కుటుంబంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో తన తల్లిని భయపెట్టాలనే ఉద్దేశంతో సింహాద్రి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని, టవల్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేకలు, రోదనలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి మృతుడిని కిందకు దించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. ఈ ఘటనపై నిడదవోలులో ఉంటున్న మృతుడి మేనమామ కాయల గణేష్‌ పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ రాజేంద్ర కేసు నమోదు చేసి, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు నగర శివారు శనివారపుపేట ప్రాంతంలో దస్తావేజు లేఖరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంతానికి చెందిన వల్లి శివరామకృష్ణ (44)కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన ఏలూరు రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శివరామకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ నొప్పి అధికం కావడంతో, దానిని తగ్గించే మందును ఆయన అధిక మోతాదులో తాగారని, ఆ తర్వాత నిద్రలోకి జారుకుని మంచంపై నుంచి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్‌) తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన మృతిచెందారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement