ఉండి: వచ్చేనెల 10 నుండి 12 వరకు తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–17 హ్యాండ్‌బాల్ పోటీలకు ఎన్నార్పీ అగ్రహారం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పి. చంద్రశేఖర్‌నాయుడు, డి. మనోజ్ ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఏలూరులో జరిగిన ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన పీఈటీ కె. వెంకటేశ్వరరావును పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా మంచి భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు రెండింటిలోనూ రాణించాలని హెచ్‌ఎం సూచించారు.
చింతూరు: ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో ఆదివారం గల్లంతైన బుంగా బాల వందన్ (18) మృతదేహం మంగళవారం నదిలో లభ్యమైంది. భీమవరానికి చెందిన బాల వందన్ విహారయాత్రకు కుటుంబ సభ్యులతో వ్యూ పాయింట్ వద్దకు వచ్చి సోకిలేరు వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా అతడి ఆచూకీ కోసం సీఐ గోపాలకృష్ణ, ఎస్సై నాసిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.


