భీమవరం (ప్రకాశంచౌక్): విద్యార్థులు పరిశుభ్రత పాటించడంతో పాటు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సో మవారం స్థానిక ఏఆర్‌కేఆర్ ఎంపీఎల్ పాఠశాలలో విద్యార్థులకు ఆమె స్వయంగా మాత్రలు వేశారు. నులిపురుగులు ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం వంటి అంశాలను వివరించారు. ముఖ్యంగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా పలురకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ముందుగా డీఎంహెచ్‌లో డాక్టర్ సి.భారత లక్ష్మి,, జిల్లా నులిపురుగుల నిర్మూలన వైద్యాధికారి డాక్టర్ వి.క్రాంతికుమార్ స్వయంగా నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకున్న పిల్లలకు స్పూర్తి కల్పించారు. డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్, మారుతీనగర్ పీహెచ్‌సీ డాక్టర్ ఎ.సుమ, విద్య, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


