గుండెపోటు లక్షణాలు
తక్షణ వైద్యసహాయం అవసరం
జీవనశైలి మార్పుతో మేలు
ద్వారకాతిరుమల, కామవరపుకోట : నేటి ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, పొగతాగడం వంటి అలవాట్లు మానవ గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం, ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో సత్వర చికిత్స అందేలా చూడటమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
చిన్న వయసులోనే ముప్పు
ఒకప్పుడు వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపించే గుండెపోటు, ఇప్పుడు చిన్న వయసులోనే అధికంగా నమోదవుతోంది. ఉత్తర భారతదేశ గుండెపోటు పరిశోధనా రిజిస్ట్రీ ఆధారంగా ప్రచురితమైన అధ్యయనాల్లో 50 ఏళ్లలోపు వారే మూడో వంతుకు పైగా బాధితులుగా ఉన్నట్లు వెల్లడైంది. పొగాకు వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ అసమతుల్యత చిన్న వయసులోనే ఈ ముప్పును పెంచుతున్నాయి. మరోవైపు, కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల హార్ట్ ఎటాక్‌లు పెరిగాయన్న ప్రచారానికి బలమైన శాసీ్త్రయ ఆధారాలు లేవని, ఇన్‌ఫెక్షన్లు లేదా ఇతర అనారోగ్య సమస్యలే దీనికి కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గుండెపోటుకు గురైన వ్యక్తి (ప్రతీతాత్మక చిత్రం)
పార్క్‌లో ఉదయాన్నే వాకింగ్, వ్యాయామాలు
గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో బిగుతు, ఒత్తిడి, నొప్పి లేదా మంట ఉండవచ్చు. ఈ అసౌకర్యం చేతి, భుజం, వీపు, మెడ, దవడ లేదా పొట్ట వైపు పాకడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో ఈ లక్షణాలు కొంత భిన్నంగా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బాధితుడిని నడిపించకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి అత్యవసర వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులూ ఇవ్వకూడదు. శ్వాస లేకపోతే శిక్షణ పొందినవారు తక్షణమే సీపీఆర్ అందించాలి. గుండెపోటు అనుమానం వచ్చినప్పుడు ప్రతి నిమిషం కీలకమే.
మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వల్ల చిన్న వయసులోనూ గుండెపోటు ముప్పు పెరుగుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక బరువును అదుపులో ఉంచుకోవాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించి.. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పొగతాగడం మానేసి.. రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. ఛాతీలో బిగుతు, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి.
– డాక్టర్ సీహెచ్‌వీ బలరామకృష్ణ, డీఎం (కార్డియాలజీ)బెంగుళూరు
ఒత్తిడిని తగ్గించుకుని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయటం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ, జంక్ ఫుడ్స్, నూనె పదార్థాలను తగ్గించాలి. గుండెకు మేలు చేసే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మంచి ఆహారపు అలవాట్లతో జీవనశైలిని మార్పు చేసుకోగలిగితే గుండె ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా జీవించగలుగుతాం.
– డాక్టర్ ఎస్.వేణు, కార్డియాలజిస్ట్, విజయ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం
గుండె జబ్బులకు జీవనశైలే ప్రధాన కారణం
లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స పొందితే ముప్పు తగ్గే అవకాశం
నేడు ప్రపంచ హృదయ దినోత్సవం


