భీమవరం: పట్టణానికి చెందిన ఇంద్రజాలికుడు, రచయిత బోస్‌కు మాయాకళానిధి బిరుదు లభించింది. ఆంధ్రప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో మాయాబజార్–2 పేరుతో నిర్వహించిన మేజిక్ ఫెస్టివల్‌లో బోస్‌ను మాయాకళానిధి బిరుదుతో ఘనంగా సన్మానించారు. విభిన్న కార్యకలాపాలతో మేజిక్ రంగంలో మల్టీటాలెంటెడ్ మెజీషియన్‌గా రాణిస్తూ, మేజిక్ రంగానికి బోస్ అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ బిరుదుతో సత్కరిస్తున్నట్లు ఫెస్టివల్ నిర్వాహక అధ్యక్షుడు జె. వెంకటేశ్వరరావు, నిర్వాహక కార్యదర్శి కేవీవీవీ కుమార్ తెలిపారు.
భీమవరం: స్థానిక బ్రౌనింగ్ కళాశాలలో సోమవారం స్కూల్ గేమ్స్ అండర్–19 బాలబాలికల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కందికొండ జయరాజ్ తెలిపారు. నెట్‌బాల్, షూటింగ్, మాల్కంబ్, ఆర్చరీ వంటి పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు త్వరలో నిర్వహించే 70వ స్కూల్ గేమ్స్ అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
నిడమర్రు: వైద్యం కోసం వచ్చిన మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుపై నిందితుడైన పీఎంపీ వైద్యుడు అడపా సత్యనారాయణను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నక్కా రజనీకుమార్, ఎస్సై లంక రాజేష్ తెలిపారు. నిడమర్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ సదరు పీఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో అతను బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి వాగ్మూలం, సాక్షుల నుంచి అవసరమైన ఆధారాలు సేకరించి, దర్యాప్తులో లభించిన నిరూపణల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్ విధించినట్లు వారు వెల్లడించారు.
పెంటపాడు: మండలంలోని కునాకరపేట ప్రాంతంలో ఈనెల 26న జరిగిన రహదారి ప్రమాదంలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వివరాలు వెల్లడించారు. భీమవరం నుంచి గూడెం వైపు వెళ్తున్న కళాశాల బస్సు డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో.. ఎదురుగా భీమవరం వైపు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న పెంటపాడు గ్రామానికి చెందిన కొవ్వూరి జయప్రకాష్‌రెడ్డిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో గూడెం ప్రైవేట్ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అనంతరం రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుని తరఫున సత్తి నాగసతీష్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంటపాడు ఎస్సై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో ముద్దాయికి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది ఫిబ్రవరి 26న బాధితురాలు (వయస్సు 11 సంవత్సరాలు) ఇంటి సమీపంలోని కాగితాల రాంబాబు ఇంటి వద్ద మారేడు ఆకులు కోస్తుండగా, నిందితుడు రాంబాబు అక్కడికి వచ్చి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై బాలిక భయపడి వెంటనే ఇంటికి వచ్చి, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా వారు ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి ఎస్సై ఎం.కుటుంబరావు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రస్తుత ధర్మాజీగూడెం ఎస్సై కె. వెంకన్న కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదప్రతివాదనలు విని, విచారణ జరిపిన ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి కానుగల వాణిశ్రీ... ముద్దాయి రాంబాబుపై నేరం రుజువైన నేపథ్యంలో అతనికి 6 నెలల జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.


