కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన పల్లికొండ మునీంద్రబాబు (35) మృతి ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన గెల్లా చందు పిలవడంతో మునీంద్రబాబు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా, 26న రాత్రి గోపాలపురం మండలం నందిగూడెం శివారులో ఆయన బైక్ లభ్యమైంది. దీనిపై బాధితుడి సోదరుడు మధుశేఖర్ కొయ్యలగూడెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, 27వ తేదీ రాత్రి దేవరపల్లి గ్రామం వద్ద పోలవరం కాలువలో ఒక పురుషుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి పరిశీలించగా, అది మునీంద్రబాబు మృతదేహమని గుర్తించారు. మృతుడి తలపై గాయాలు ఉండటం, చివరిసారిగా గెల్లా చందు, ఆయునపర్తి సంజయ్‌లతో కలిసి కనిపించడంతో వారిపై అనుమానం ఉందని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో మొదట అదృశ్యంగా నమోదైన కేసును, హత్య అనుమానాస్పద కేసుగా మార్చి ఎస్సై దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నిందితుడి ఇల్లు కూల్చివేత
మునీంద్రబాబు మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలంటూ స్థానికులు, బంధువులు ఆందోళనకు దిగడంతో కన్నాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునీంద్రబాబు వద్ద కార్పెంటర్‌గా పనిచేసే వ్యక్తినే కావాలనే ఈ హత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఈ నిందితుడు గతంలో గవరవరం నుంచి కన్నాపురం వచ్చి భార్యాపిల్లలతో కలిసి స్థిరపడినట్లు తెలిసింది. హత్యోదంతానికి కారణమైన వ్యక్తిపై ఆగ్రహించిన మృతుడి బంధువులు, మిత్రులు సోమవారం గ్రామంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటిని జేసీబీతో నేలమట్టం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యోదంతం, ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.


