భీమవరం: సమగ్ర శిక్ష విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐ.శ్రీనివాస్, పి.సుబ్బారావు తెలిపారు. శనివారం సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యామ్‌సుందర్, డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్‌కు ధర్నా నోటీసు అందించిన అనంతరం మాట్లాడారు. సమగ్ర శిక్ష విభాగంలో ఆర్ట్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా విద్యాశాఖలో విలీనం చేసి సర్వీసును క్రమబద్ధీకరించకపోవడం, పీటీఐ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు, డిప్యూటేషన్‌పై విధులు కేటాయించే విధానాన్ని ఉపసంహరించుకోవాలనే తదితర డిమాండ్ల సాధన కోసం ధర్నా చేపట్టామన్నారు. సంఘ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.వినయ్‌కుమార్, ఎ.దుర్గాప్రసాద్, ఎన్.సాయినాథ్ పాల్గొన్నారు.
నరసాపురం: నరసాపురం గోదావరి పడవల రేవులో పంటు రాకపోకలను శనివారం పునరుద్ధరించారు. గోదావరిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో అధికారులు శుక్రవారం పంటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే అయితే వరద ప్రవాహ ఉధృతి తగ్గడంతో ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా రాకపోకలు పునరుద్ధరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎంవీ జాన్ మార్టిన్ తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఆదివారం బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. ఏటీఎంలు, డిజిటల్ బ్యాంకింగ్, ఇతర అందుబాటు లో ఉన్న బ్యాంకింగ్ సేవలను అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని సూచించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గూగుల్ మీట్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను అన్ని డివిజన్లలో నూరుశాతం పూర్తి చేయాలని ఎలక్ట్రికల్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా తణుకు, ఆచంట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ ఎస్‌ఈ పి.ఉషారాణి మాట్లాడుతూ ప్రజల్లో సానుకూలమైన అభిప్రాయం సేకరణలో 23వ స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, విద్యుత్ ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.
పెనుగొండ: భాద్రపద పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వశిష్ట గోదావరికి భక్తిశ్రద్ధలతో పంచహారతులు ఇచ్చారు. శనివారం రాత్రి కలగ భద్రుడు స్వామి బ్రహ్మత్వంలో కంచర్ల వెంకట నరసింహమూర్తి, మహాలక్ష్మీ దంపతులు పూజాదికా లు నిర్వహించారు. నదీమ తల్లులను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని వేద పండితులు తెలిపారు. హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో జాప్యాలను నివారించి, పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో ఇప్పటికే అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, వినూత్న పరిష్కారాలు ఉంటే వాటిని గుర్తించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పంచుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలు, సమస్యలు, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అన్నారు.


