యలమంచిలి: తమ న్యాయమైన కోర్కెలు తీర్చేలా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వీఆర్‌ఏలు వరుణ దేవుడిని వేడుకున్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా తొమ్మిదో రోజు గురువారం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జోరు వానలో దీక్ష కొనసాగించారు. తమ సమస్యలు తీర్చేలా ప్రభుత్వానికి కనువిప్పు కలగించమని వరుణ దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మట్టపర్తి నరసింహారావు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో కీలకమైన తమపై ప్రభుత్వం కనికరం చూపకపోవడం దారుణమన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు కురెళ్ల శ్రీనివాస్, కార్యదర్శి హనుమంతావు, కోశాధికారి టి.ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కురెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఈనెల 27న భీమవరం చింతలపాటి బాపి రాజు మెమోరియల్ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్టు జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జామాను రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్ తెలిపారు. గురువారం భీమవరంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ హాజరవుతారన్నారు. మండల, పట్టణ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు జిల్లాస్థాయి సైన్స్ సంబరాల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు సెల్ 72076 38826, 98496 66417 నంబర్లను సంప్రదించాలని రామలక్ష్మణరావు, శ్రీనివాస్ చెప్పారు.
భీమవరం: యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 26న భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు సెట్‌వెల్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీఈఓ కేఎస్ ప్రభాకరరావు చెప్పారు. ఫెస్టివల్ పోస్టర్‌ను గురువారం కళాశాలలో విడుదల చేశారు. యూత్ ఫెస్టివల్‌లో ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్స్, జానపద నృత్యాలు, పెయింటింగ్, పొయిట్రీ రైటింగ్ తదితర అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ జి.హరీష్ కుమార్‌వర్మ పాల్గొన్నారు.
భీమవరం: జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని మేనేజ్‌మెంట్, కేటగిరీల విద్యాసంస్థలకు శుక్రవారం పరిహార సెలవు ప్రకటించామని డీఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామని తెలిపారు.
రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగుల భవి ష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం కార్యాలయం పరిధిలో ఈనెల 28న ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికట్–డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎంకే వెంకటరావు గురువారం ప్రకటనలో వెల్లడించారు. ఏలూరు జిల్లాకు నల్లజర్లలోని ఎస్‌ఆర్‌కే ఎడ్యుకేషనల్ సొసైటీ, పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరంలోని డీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
పోలవరం రూరల్: గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరుతుండటంతో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదుల నీటికి తోడు శబరి నీరు కూడా పెరుగుతుండటంతో ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 29 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన ఇసుక తిన్నెలను ముంచుకుంటూ ప్రవహిస్తోంది. మరో రెండు రోజులపాటు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.


