ఎట్టకేలకు దేవుడి భూమికి రక్షణ! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు దేవుడి భూమికి రక్షణ!

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

ఎట్టకేలకు దేవుడి భూమికి రక్షణ!

కీలక టీడీపీ నేతలకు షాక్‌

ద్వారకాతిరుమల: దేవుడి భూమికి ఎట్టకేలకు రక్షణ లభించింది. ఆలయ ఆస్తులను పరిరక్షించాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో.. తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురంలోని జగన్నాధుని ఆలయానికి చెందిన 1.73 ఎకరాల వివాదాస్పద భూమిలో అధికారులు రెండు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. సదరు భూమి శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకాతిరుమల సంరక్షణలో ఉందని, అనుమతి లేకుండా ప్రవేశించినచో శిక్షార్హులవుతారని బోర్డుల్లో స్పష్టం చేశారు. ఈ పరిణామంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇంతకాలం భూమి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేతలకు హైకోర్టు ఆదేశాలు షాక్‌ ఇచ్చాయని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

ఆలయ ఆస్తుల పరిరక్షణకు ఆదేశం

సర్వే నంబర్‌ 38/1లోని 1.73 ఎకరాల ఈ భూమి పూరీ మఠాధిపతి మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యుడైన సంపత్‌ కుమారాచార్యుల ద్వారా శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన జగన్నాథుని ఆలయానికి సంక్రమించినట్టు దాత వంశీకులు పేర్కొంటున్నారు. అయితే ఈ భూమిని కొందరు టీడీపీ నేతలు కబ్జా చేసిన వ్యవహారంపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టడంతో వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో గతంలో ‘కమ్మ సేవా సంఘం ద్వారకాతిరుమల మండలం’ పేరుతో నమోదు చేసిన వివరాలను అధికారులు తొలగించి.. ప్రస్తుతం ‘కాలనీ’గా నమోదు చేశారు. అయితే ఇది సరికాదని, రికార్డుల్లో దేవుడి పేరు నమోదు చేయాలని దాత వంశీకులు శ్రీమత్‌ ప్రతివాద భయంకర మంత్రరత్నం రాధాకృష్ణమాచార్యులు, శ్రీమత్‌ ప్రతివాద భయంకర మంత్రరత్నం పార్థసారథి అయ్యంగార్లు రెవెన్యూ అధికారులను కోరినా, వారు స్పందించకపోవడంతో ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వారి రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. భూమికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తార్లాడ రాజశేఖరరావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా ఆలయ ఆస్తులను పరిరక్షించాలని దేవస్థానం ఈఓకు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

బోర్డులతో రక్షణ..

కోర్టు ఆదేశాల నేపథ్యంలో దేవస్థానం అధికారులు వివాదాస్పద భూమిలో రెండు బోర్డులను ఏర్పాటు చేశారు. భూమి దేవస్థానం సంరక్షణలో ఉన్నట్టు, అనుమతి లేకుండా ప్రవేశిస్తే శిక్షార్హులవుతారన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. దీంతో భూమి విషయంలో ఎలాంటి అనధికార కార్యకలాపాలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.

హైకోర్టు ఆదేశాలతో వివాదాస్పద భూమిలో రెండు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

అనుమతులు లేకుండా ప్రవేశిస్తే శిక్షార్హులంటూ స్పష్టీకరణ

చర్యలపై భక్తుల హర్షం.. కబ్జాకోరు టీడీపీ నేతలకు షాక్‌

స్వామివారి ఆలయానికి సంబంధించిన భూమిపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు, దేవస్థానం అధికారులు చేపట్టిన చర్యలతో భూమి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేతలకు షాక్‌ తగిలినట్లయ్యింది. ఏది ఏమైనా.. వివాదాస్పద భూమిలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement