● పెట్రోల్ బంకులో నిర్వాకం
● లబోదిబోమన్న వాహనచోదకులు
● ఆక్వా చెరువుల వద్ద ఆగిపోయిన జనరేటర్లు
ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో రెండు పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. ఒకటి ప్రైవేటు బంక్ కాగా, రెండోది పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇందులో ప్రైవేటు బంక్‌లో మాత్రం ప్రతిఏటా ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. కొలతల్లో తేడాలున్నాయని ఒకసారి, డీజిల్‌కు బదులుగా నీళ్లు ఇస్తున్నారంటూ గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. గురువారం ఉదయం నుంచి బంకులో వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. ఈ క్రమంలో ఆక్వా చెరువుల యజమానులు విద్యుత్ కోతల కారణంగా జనరేటర్ల కోసం డీజిల్ పట్టుకెళ్లారు. అయితే, బంకులో డీజిల్‌కు బదులు నీరు ఉండటంతో జనరేటర్లు ఆగిపోయి మొరాయించాయి. దీంతో ఆక్వా రైతులు లబోదిబోమంటూ మీడియాకు ఫోన్ చేశారు. పలువురు మీడియా ప్రతినిధులు వివరాలు ఆరా తీసేందుకు బంకు వద్దకు వెళ్లగా.. అప్పటికే అక్కడ ఒక కారు, ఒక పొక్లెయిన్ డీజిల్‌కు బదులు నీరు కొట్టడం వల్ల ఆగిపోయి ఉన్నాయి. దీనిపై బంక్ ప్రతినిధిని ఆరా తీయగా.. ‘మేమేం చేయాలి? వర్షం కురవడం వల్ల భూమిలోపల ఉన్న ట్యాంకులోకి నీరు వెళ్లింది’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అప్పటికే రెండు కార్లు రిపేరు నిమిత్తం భీమవరం వెళ్లగా, మరో కారు యజమాని మాత్రం బంకు వద్దకు వచ్చి పరిశీలించాలని పట్టుబట్టారు. చేసేది లేక బంక్ యాజమాన్యం ఆ కారు డీజిల్ ట్యాంక్‌ను ఊడదీసి బయటకు తీసి చూడగా, ట్యాంక్ నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. అలాగే రోడ్డు పక్కన ఉన్న పొక్లెయిన్ కూడా నీరు చేరడం వల్ల కదలలేని స్థితిలో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు బంకు వద్దకు చేరుకుని, పై అధికారులకు సమాచారం ఇస్తానని తెలిపారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా సరైన చర్యలు తీసుకోని అధికారులపై వినియోగదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిసారి ఇలాంటి ఆరోపణలు రావడం, వాటిని లోపాయికారిగా సర్దుబాటు చేసుకోవడం సాధారణమైపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.


