● ఈనెల 28న, వచ్చే నెల 5న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
● ఏలూరు జిల్లాలో 3.88 లక్షల మందికి అందజేత
గణపవరం : అందరికీ ఆరోగ్యం నినాదంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు, జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ ఆల్‌బెండాజోల్ మాత్రల పంపిణీని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఈనెల 28న ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఈ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ప్రతి విద్యార్థి ఈ మాత్ర వేసుకునేలా ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈనెల 28న మాత్ర వేసుకోని పిల్లల కోసం, అక్టోబర్ 5న ప్రత్యేకంగా మరోసారి పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసున్న 3,88,955 మందికి ఈ మాత్రలు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నులిపురుగులు ఎలా వ్యాపిస్తాయి?
సన్నని దారంలా ఉండే ఈ పురుగులు ప్రేగులలో చేరి రక్తాన్ని పీల్చడం వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడతాయి. అపరిశుభ్రత, కలుషితాహారం, గోళ్లను కత్తిరించకపోవడం, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన, కాళ్లకు చెప్పులు ధరించకపోవడం వల్ల ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ప్రధాన లక్షణాలు
● ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం, వాంతులు.
● రక్తహీనత, నీరసం, బరువు తగ్గడం, ఎదుగుదల లోపించడం.
● చదువులో ఏకాగ్రత తగ్గడం, చర్మంపై దద్దుర్లు రావడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● 2 నుండి 19 ఏళ్ల వయస్సు గలవారు 400 మి.గ్రా మాత్రను, రెండేళ్ల లోపు పిల్లలు అందులో సగం మోతాదును తీసుకోవాలి.
● ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో ఈ మాత్ర వేసుకోరాదు. మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మింగాలి.
● తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకున్నాక ఈ మాత్ర వేసుకోవాలి. గర్భిణులు, బాలింతలు, కాలేయ లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఈ మాత్రలకు దూరంగా ఉండాలి.
28న డీ వార్మింగ్ డే
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న (శుక్రవారం) జరగాల్సిన డీ వార్మింగ్ డేను ఈనెల 28న (సోమవారం) నిర్వహించాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


