వ్యక్తిగత భద్రతపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత భద్రతపై అవగాహన తప్పనిసరి

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

వ్యక్తిగత భద్రతపై అవగాహన తప్పనిసరి

భీమవరం (ప్రకాశంచౌక్‌): వసతి గృహాల్లో విద్యార్థినులు చదువుతో పాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం, నరసయ్య అగ్రహారంలోని బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, పరిసరాలు, మౌలిక వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించి, అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన కలెక్టర్‌, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. బాలికలు ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక విద్యా రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. అలాగే, ప్రతి విద్యార్థిని తమ మొబైల్‌లో ‘శక్తి యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించారు. వేధింపులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ యాప్‌ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. యాప్‌ వినియోగంపై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, పారిశుద్ధ్యం, మంచి ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఏవీ సూరిబాబు, భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement