కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు కావొస్తున్నా.. మాకు ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం అందలేదు. స్థానిక ప్రజాప్రతినిధులపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల బకాయిలను మొత్తం చెల్లించేవారు.
– ఆకుర్తి సత్యన్నారాయణ, ఎంపీటీసీ, తిరుమలంపాలెం, ద్వారకాతిరుమల మండలం
ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఎక్కువ మంది వైఎస్సార్ సీపీ వారు ఉండటంతో వారి వేతనాలను రెండున్నరేళ్లుగా విడుదల చేయకుండా చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు ఇదే నిదర్శనం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూటమి సర్కార్‌లో సరైన గౌరవం దక్కలేదు.
– కొప్పిశెట్టి గంగ, ఎంపీటీసీ, నారాయణపురం, ద్వారకాతిరుమల మండలం
ద్వారకాతిరుమల: ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు అందించాల్సిన గౌరవ వేతనాన్ని సైతం ప్రభుత్వం ఎగ్గొట్టింది. పదవీ విరమణ చేయనున్న ఎంపీపీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూటమి సర్కార్ బకాయిల బహుమతిని అందించింది. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 733 మంది ఎంపీటీసీలు, 48 మంది ఎంపీపీలు, 45 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీలకు నెలకు రూ. 6 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ. 3 వేలు, జెడ్పీటీసీ సభ్యులకు రూ. 6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. 2021లో బాధ్యతలు చేపట్టిన మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 23తో, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది. అయితే తమకు 28 నెలల గౌరవ వేతనం బకాయి ఉన్నట్టు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని ఎంపీపీ, ఎంపీటీసీలకు కలిపి సుమారు రూ. 9.45 కోట్లు, 45 మంది జెడ్పీటీసీ సభ్యులకు రూ. 1.03 కోట్ల మేర బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
అసలుకే ఎసరు
2024 ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతామని సీఎం చంద్రబాబు హామీలు ఇచ్చారని పలువురు సభ్యులు గుర్తుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ వేతనాలను పెంచకపోగా.. ఉన్నవాటిని కూడా ఇవ్వకుండా అసలుకే ఎసరు పెట్టారని ధ్వజమెత్తుతున్నారు. చిన్న మొత్తమైనప్పటికీ నెలనెలా అందాల్సిన గౌరవ వేతనం అందడంలేదని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, మండల పరిషత్, జిల్లా పరిషత్ సమావేశాల్లోనూ ఈ అంశంపై పలుమార్లు ప్రస్తావించినా బకాయిలు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలకు హాజరు కావడంతోపాటు గ్రామాల్లో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేశామని, అయినా కనీసం గౌరవ వేతనం ఇవ్వకపోవడం దారుణమని అంటున్నారు.
వైఎస్సార్ సీపీ వారనే..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వైఎస్సార్ సీపీ వారు కావడం, తమ పార్టీ సానుభూతి పరులు పెద్దగా లేకపోవడంతో బాబు సర్కార్ కనీసం గౌరవ వేతనాలను కూడా అందించకుండా తమను సాగనంపుతోందని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, బిల్లులు విడుదల చేసే సమయంలో ఏదో ఒక సాకుతో మోకాలు అడ్డుపెడుతూ వచ్చారని ఆరోపించారు.
ఆఖరి రోజైనా ఇస్తారా..
పదవీకాలం ఆఖరి రోజైనా.. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం అందిస్తుందేమోనన్న ఆశతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం వారికి నగదు ఇస్తుందో.. లేక హ్యాండ్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఉమ్మడి పశ్చిమలో ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని ఎగ్గొట్టిన కూటమి సర్కార్
ఎంపీపీలు, ఎంపీటీసీలకు రూ. 9.45 కోట్లు.. జెడ్పీటీసీలకు రూ. 1.03 కోట్లు బకాయిలు పడ్డ ప్రభుత్వం
నేటితో ఎంపీటీసీలు.. రేపటితో జెడ్పీటీసీల పదవీకాలం పూర్తి


