● రైలు ప్రయాణికుల మొబైల్ ఫోన్ల చోరీ
● విడిభాగాలుగా చేసి విక్రయం
● నిందితుడిని అరెస్ట్ చేసిన జీఆర్‌పీ పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు కొట్టి అపహరిస్తున్న దొంగను ఏలూరు జీఆర్‌పీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను ఏలూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎంవీ దుర్గారావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఏలూరు రైల్వే ఎస్‌ఐ కృపాదానం, హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరరావు, రైటర్ ప్రసాద్, హోంగార్డు కుమార్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘటన వివరాలు
రెండేళ్లుగా ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రైలు మెల్లగా వెళ్తున్న క్రమంలో... ఒక వ్యక్తి కర్రతో ప్రయాణికుల చేతుల్లోని సెల్‌ఫోన్లను కొట్టి అపహరిస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు గుమ్మాలు, కిటికీల వద్ద ప్రయాణికులు సెల్‌ఫోన్లు చేతిలో ఉంచుకుని చూస్తున్న సందర్భాలను ఆసరాగా చేసుకుని నిందితుడు ఈ నేరానికి పాల్పడుతున్నాడు. అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాలతో, రైల్వే డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో పవర్‌పేట నుంచి ప్రధాన రైల్వే స్టేషన్ మధ్య ప్రాంతంలో పోలీసులు నిఘా ఉంచారు. గత కొద్దిరోజులుగా దర్యాప్తు చేస్తుండగా... మంగళవారం ఏలూరు మారుతీనగర్‌కు చెందిన కల్లేపల్లి సతీష్ (19) ఇదే తరహాలో మొబైల్ ఫోన్లు అపహరిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుడు సతీష్ నుంచి ఒప్పో రెనో, మోటో జీ85 మొబైల్ ఫోన్లు, నేరానికి వినియోగించిన వెదురు కర్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారించగా, సుమారు ఏడాదిన్నర కాలంగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. చోరీ చేసిన సెల్‌ఫోన్లను ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని చాందిని మొబైల్స్ దుకాణానికి విక్రయిస్తున్నట్లు తేలింది. ఆ దుకాణ యజమాని ఆకుల పూర్ణనాగేంద్రకుమార్ (ఏ–2) ఆ మొబైల్ ఫోన్లను విడిభాగాలుగా చేసి విక్రయిస్తుండటంతో పోలీసులు వాటిని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. విచారణలో భాగంగా చాందిని మొబైల్స్ యాజమాని వద్ద నుంచి మరో 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని, నిందితుడు ఇప్పటివరకు మరో 20 సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు తేలిందని సీఐ దుర్గారావు స్పష్టం చేశారు. మొత్తం మీద నిందితుడు సుమారు రూ.6 నుంచి రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు గేట్ల వద్ద, మెట్లపై నిలబడి సెల్‌ఫోన్లు వినియోగించడం సురక్షితం కాదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


