తణుకు అర్బన్: ఆర్టీసీ కార్గో సేవల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమర్షియల్ మేనేజర్ జీఎల్‌పీవీ సుబ్బారావు సూచించారు. మంగళవారం ఆయన తణుకు ఆర్టీసీ డిపోలోని కార్గో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్గో ద్వారా వినియోగదారులు రవాణా చేసే పార్సిళ్లు, ఇతర సామాగ్రి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పార్సిళ్లను స్వీకరించడంలోనూ, డెలివరీ ఇవ్వడంలోనూ వినియోగదారుల సమయం వృథా కాకుండా ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
కొత్త ఏజెంట్ల నియామకం
కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో తణుకు పరిసర ప్రాంతాల్లో నూతన ఏజెన్సీలను ఏర్పాటు చేయనున్నట్లు సుబ్బారావు తెలిపారు. తణుకు వై జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, వెంకటేశ్వర థియేటర్, టౌన్‌హాల్ కాంప్లెక్స్ సెంటర్, వీరనారాయణ థియేటర్ సెంటర్, ఉమెన్స్ కాలేజ్, దువ్వ, తేతలి, ఉండ్రాజవరం, సిద్ధాంతం, పెరవలి ప్రాంతాల్లో కార్గో ఏజెంట్లను నియమించదలిచామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా కమర్షియల్ మేనేజర్ 73311 47263, డిపో మేనేజర్ 98484 98583, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 98491 69396 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఏడీఎల్ సుధారాణి, డీఎంఈ షేక్ లాల్ తదితరులు పాల్గొన్నారు.


