ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశించాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థలో దొంగలుపడ్డారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము పక్కదారి పట్టింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన దాదాపు రూ.కోటి నిధులను బడా వ్యక్తుల ఖాతాలకు మళ్లించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేనేజర్ మొదలుకొని పలువురు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నప్పటికీ, కేవలం ఇద్దరు చిరుద్యోగులను బలి చేసి విచారణ ముగించేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ఆదాయంతో అరకొర అభివృద్ధి పనులు జరిగే కార్పొరేషన్‌లో ఈ స్థాయి అక్రమాలు జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏటా రూ.35 కోట్ల ఆదాయం
3.24 లక్షల జనాభా ఉన్న ఏలూరు నగరపాలక సంస్థ పరిధి ఇటీవల 7 విలీన గ్రామములతో కలిపి 62 డివిజన్లకు విస్తరించింది. 75 వేల ఇళ్ల అసెస్‌మెంట్లు, 400 దుకాణాల ద్వారా ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, దుకాణాల అద్దెల రూపంలో ఏటా రూ.30 నుంచి 35 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఈ పన్నులను కార్యాలయ రెవెన్యూ విభాగంలోని ప్రత్యేక చెల్లింపుల కేంద్రంలో నగదు రూపంలో వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారం రోజూ వచ్చిన ఆదాయాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, కొందరు అధికారులు దీనిని పక్కదారి పట్టించారు.
గత నవంబర్ నుంచే దోపిడీ
గతేడాది నవంబర్‌లోనే ఈ దోపిడీకి తెరలేచినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. కౌంటర్‌లో నగదు వసూలు చేసే షరాఫ్ (జూనియర్ అసిస్టెంట్) ఆ రసీదులను అకౌంట్స్ విభాగానికి అప్పగించాలి. ఆ తర్వాత మేనేజర్ పరిశీలించి, ఈఆర్‌పీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే దశాబ్దాలుగా ఇక్కడే పాతుకుపోయిన ఉద్యోగులు, బడా నేతల అండదండలతో ఆరు నెలలుగా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. గతేడాది నవంబర్‌తో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల వసూళ్లు ఎక్కువగా ఉన్న సమయంలో భారీగా నిధులు మళ్లించినట్లు తెలిసింది.
కీలక అధికారులకు రక్షణ?
వ్యవహారం బయటపడటంతో నగర కమిషనర్ భానుప్రతాప్ హడావిడిగా షరాఫ్ గునాపు శ్రీనివాసరావు, ఆఫీస్ సబార్డినేట్ కడవకొల్లు మోహన కృష్ణలను సస్పెండ్ చేశారు. అయితే రోజువారీ రికార్డులను తనిఖీ చేయాల్సిన అకౌంట్స్ ఆఫీసర్, మేనేజర్‌లపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అకౌంట్స్ ఆఫీసర్‌గా ఉన్న కేఎస్‌ఆర్ లింగేశ్వరి అర్హతలకు విరుద్ధంగా రాజకీయ పరపతితో 14 ఏళ్లుగా అదే స్థానంలో కొనసాగుతున్నారని, గతంలో ఆమైపె వచ్చిన ఆరోపణలు కూడా తొక్కిపెట్టారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుత మేనేజర్ సీహెచ్‌వీవీఎన్ మూర్తి గతంలో కారుణ్య నియామకాల వ్యవహారంలో రూ.8 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ బడా నేతల తోడ్పాటుతో అదే పోస్టులో చేరారు. రోజూవారీ జమలను ధ్రువీకరించాల్సిన వీరు, నెలకు ఒకసారి పరిశీలించాల్సిన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించి, కేవలం చిరుద్యోగులపైనే వేటు వేయడంపై మండిపడుతున్నారు.
గత రెండు, మూడు నెలలుగా షరాఫ్ సెక్షన్ నుంచి సరైన రసీదులు రాకపోవడంతో తనిఖీ చేయగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. సీడీఎంఏ ఆదేశాల మేరకు ఇద్దరు క్వాలిఫైడ్ అకౌంటెంట్లతో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే నిధులు రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అకౌంట్స్ సెక్షన్, మేనేజర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం.
– భాను ప్రతాప్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్
రూ.కోటి మేర పక్కదారి పట్టిన వైనం
ఉన్నతాధికారులను వదిలేసి చిరుద్యోగులపై వేటు ?
రాజకీయ అండతో దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికారులు
సమగ్ర ఆడిట్‌తో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి


