భీమవరం: జిల్లాలోని గ్రంథాలయాలకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా రూ. 22 లక్షలు కేటాయించినట్లు సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు తెలిపారు. శనివారం భీమవరంలోని డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయానికి అభ్యర్థుల డిమాండ్ మేరకు కొనుగోలు చేసిన పోటీ పరీక్షల పుస్తకాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, హాస్టల్ వార్డెన్స్, ఎస్సై, కానిస్టేబుల్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం సెలవు రోజుల్లోనూ భీమవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయం పని చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఎస్.వెంకటేశ్వరరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీనివాస్, జుత్తిగ రామకృష్ణ, బొక్కా సూరిబాబు, జంపన ధనరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకుడు ఎం. ముక్కంటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్నవారికి అసిస్టెంట్ టెక్నీషియన్ (ఏలూరు), కిసాన్ డ్రోన్ ఆపరేటర్ (అనంతపురం), ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (కాకినాడ), ఎలక్ట్రీషియన్–స్మార్ట్ ఎనర్జీ (శ్రీకాకుళం), సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ (కడప), ల్యాబ్ టెక్నీషియన్ (విశాఖపట్నం), డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏఐ డేటా ఇంజనీరింగ్ అనలిస్ట్ (విజయవాడ), జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ (ఒంగోలు) శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 97013 55337, 97058 63666, 96402 94967 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తాడేపల్లిగూడెం: పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమని ఉద్యానవర్సిటీ వీసీ కె.ధనుంజయరావు అన్నారు. వెంకట్రామన్నగూడెంలో శనివారం నిర్వహించిన పుట్టగొడుగుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుష్కలమైన పోషకాహార విలువలు కలిగిన, వాణిజ్యపరంగా లాభదాయకమైన పుట్టగొడుగుల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పొందవచ్చన్నారు. ఈ శిక్షణకు 33 మంది హాజరయ్యారని కేవీకే హెడ్ సీహెచ్ కిరణ్‌కుమార్ అన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై తెలుగులో రూపొందించిన కరపత్రాలను వీసీ ఆవిష్కరించారు.
ప్రత్తిపాడు: మండలంలోని టి.రాయవరం సమీపంలోని చేపల చెరువు లీజుదారుడి హత్య కేసులో ప్రధాన సూత్రధారి హతుని కుమార్తెను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామ శివారున చేపల చెరువు మకాం వద్ద ఈ నెల 11 అర్ధరాత్రి ఏలూరు జిల్లా పైడి చింతపర్రుకు చెరువు లీజుదారు మోరి నరసింహారావు (70) హత్య కేసులో నిందితుడు అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పడాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేన్ డ్రైవర్ వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అనే జయబాబును శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని పథకం ప్రకారం అతడితో హత్య చేయించిన బలే నాగలక్ష్మిని స్థానిక జాతీయ రహదారిపై పాదాలమ్మ తల్లి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు.


