తాడేపల్లిగూడెం: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తుతో లడ్డూ తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటి జంతువుల అవశేషాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్ల నిల్వలను, ఆగస్టు 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేరే డైరీ పేరుతో తిరిగి టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
రాజకీయ కుట్ర బయటపడింది
నమూనాల పరీక్షల్లో కొలెస్ట్రాల్ గానీ, జంతు కొవ్వుల ఆనవాళ్లు గానీ లేవని, కేవలం పామాయిల్, కొబ్బరి నూనె వంటి నకిలీ నెయ్యి పదార్థాలను మాత్రమే గుర్తించారని తెలిపారు. మరి ఏ ఆధారంతో జంతు కొవ్వు కలిపారంటూ దేశమంతా ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పన్నిన రాజకీయ కుట్ర ఇది అని విమర్శించారు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ, చంద్రబాబు, పవన్‌లు భక్తుల మనోభావాలను గాయపరిచారని ఆరోపించారు. ప్రాయశ్చిత్త దీక్షలు, సభల పేరుతో హడావుడి చేసిన పవన్ కల్యాణ్, తాను చేసిన అసత్య ప్రచారానికి ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? అని నిలదీశారు. రాజకీయ కక్షలు ఉంటే నేరుగా ఎదుర్కోవాలి తప్ప, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను రాజకీయ యుద్ధంలోకి లాగడం తగదన్నారు. నిజాలు నిగ్గు తేలినందున చంద్రబాబు, పవన్ కల్యాణ్ బహిరంగంగా తప్పు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రఘురాం డిమాండ్ చేశారు.
వడ్డి రఘురాం


