పత్రాల్లో మెరుపు.. పరిసరాల్లో మురుగు | - | Sakshi
Sakshi News home page

పత్రాల్లో మెరుపు.. పరిసరాల్లో మురుగు

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

పత్రాల్లో మెరుపు.. పరిసరాల్లో మురుగు

ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

ద్వారకాతిరుమల: గ్రామాల్లో, పలు పట్టణాల్లో ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త.. పూడుకుపోయిన మురుగు డ్రెయినేజీలు.. దోమల బెడద.. ఇవన్నీ నిత్య పారిశుధ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఒకవైపు పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. సెప్టెంబర్‌ 20వ తేదీన ప్రపంచ శుభ్రత దినోత్సవం సందర్భంగా వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న వేళ.. దేశంలో స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమాలు ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెలరోజుల పాటు కొనసాగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరాలంటే ఒక్కరోజు శ్రమదానం, ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. రోజువారీ చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేర్పాటు, మురుగు డ్రెయినేజీల శుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణ నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది.

రికార్డుల్లోనే స్వచ్ఛత..

స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2026 మార్చి 18 నాటికి ఏలూరు జిల్లాలో 627, పశ్చిమగోదావరి జిల్లాలో 269 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ మోడల్‌గా నమోదయ్యాయి. అంటే రెండు జిల్లాల్లో కలిపి 896 గ్రామాలు ఈ కేటగిరీలో ఉన్నాయి. అయితే ఈ హోదా నమోదైనంత మాత్రాన ఆయా గ్రామాల్లో నిత్యం చెత్త సేకరణ, డ్రెయినేజీల శుభ్రత, మురుగునీటి నిర్వహణ సమర్థంగా జరుగుతున్నట్టు కాదు. రికార్డుల్లో కనిపించే స్వచ్ఛతకు.. క్షేత్రస్థాయిలో కనిపించే పరిస్థితులకు మధ్య ఎంత తేడా ఉందన్నదే ఇప్పుడు కీలకం.

వ్యవస్థ కూడా పనిచేయాలి

పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించడం అవసరమే అయినా.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య వ్యవస్థ కూడా పనిచేయాలని స్థానికులు అంటున్నారు. ఇళ్లలో చెత్తను వేరు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని చెబుతున్న అధికారులు.. ప్రధాన డ్రెయినేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలి

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ శుభ్రతా దినోత్సవం సందర్భంగా అవగాహనకు మించి ఆచరణలో పరిశుభ్రత కనిపించాలి. గ్రామం నుంచి పట్టణం, పుణ్యక్షేత్రం వరకు.. ప్రతి ప్రాంతంలో డ్రెయినేజీలు శుభ్రంగా, చెత్త సక్రమంగా నిర్వహించబడినప్పుడే స్వచ్ఛత లక్ష్యం సాకారమవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.

రక్తం పీల్చేస్తున్న దోమ (ఏఐ చిత్రం)

చెత్తకుండీలు లేకపోవడంతో ఇంటి ముందు డబ్బా పెట్టుకుని అందులో చెత్త వేయాల్సి వస్తోంది. మరోవైపు ఇంటి ముందు ఉన్న డ్రెయినేజీ మురుగునీరు రోడ్డుపైకి పారుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. యూనియన్‌ బ్యాంక్‌ రోడ్డులో వెంటనే ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలి. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్గంలో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

– డి.రమాదేవి, గ్రామస్తురాలు, ద్వారకాతిరుమల

రికార్డుల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌.. క్షేత్రస్థాయిలో మాత్రం పేరుకుపోతున్న చెత్త

ఎక్కడికక్కడ పూడుకుపోయిన డ్రెయినేజీలు.. తప్పని దోమల బెడద

అక్టోబర్‌ 17 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

నేడు ప్రపంచ శుభ్రత దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement