సమతుల్య ఎరువులతో మేలైన పంట | - | Sakshi
Sakshi News home page

సమతుల్య ఎరువులతో మేలైన పంట

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

భీమవరం అర్బన్‌: వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి ప్రధాన పోషకాలు అందిస్తే సరిపోదు. మొక్కకు అవసరమైన జింక్‌, ఇనుము, బోరాన్‌, మాంగనీస్‌ వంటి సూక్ష్మ పోషకాలను కూడా తగిన మోతాదులో అందించాలి. భీమవరం మండలంలో సుమారు 6,200 ఎకరాలలో సార్వా (దాళ్వా) సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వరిచేలన్నీ దుబ్బు దశలో ఉన్నాయి. వరి రైతులు నేల స్వభావాన్ని బట్టి సమతుల్య పోషక యాజమాన్యాన్ని పాటిస్తే, అధిక దిగుబడిని సాధించడంతో పాటు పంట నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని మండల వ్యవసాయాధికారి యర్రంశెట్టి ప్రసాద్‌ రైతులకు సూచిస్తున్నారు.

జింక్‌ లోపంతో...

వరిలో సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడితే మొక్క ఎదుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, పిలకలు తగ్గడం, గింజల నింపుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అందువల్ల నేల పరీక్ష ఆధారంగా జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలను వినియోగించి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

భూసారం ఆధారంగానే...

అధిక దిగుబడి కోసం రైతులు అవసరానికి మించి ఎరువులు వేయకుండా ముందుగా నేల పరీక్ష చేయించుకోవాలి. నేలలో ఏ పోషకం లోపించిందో తెలుసుకుని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించాలి. ఇలా చేయడం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు నేల సారాన్ని దీర్ఘకాలం కాపాడుకోవచ్చు.

పోషకాల అందజేత

వరి నాట్లు వేసినప్పటి నుంచి పిలకల దశ, కంకి ఏర్పడే దశ, గింజ నింపే దశ వరకు మొక్కకు పోషకాల అవసరం మారుతూ ఉంటుంది. అందువల్ల ఒకేసారి అధిక మొత్తంలో ఎరువులు వేయడం కంటే, పంట దశకు అనుగుణంగా సిఫారసు చేసిన పద్ధతిలో పోషకాలను అందించడం ప్రయోజనకరం. అవసరాన్ని బట్టి ఆకులపై పిచికారీ చేసే సూక్ష్మ పోషక మిశ్రమాలను కూడా వ్యవసాయ అధికారుల సలహాతో ఉపయోగించవచ్చు.

యూరియా అధికమైతే అనర్థం

వరి పంటలో యూరియాను అధికంగా వినియోగించడం వల్ల మొక్కలు పచ్చగా కనిపించినప్పటికీ, తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చు పెరగడంతో పాటు పంట సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలను సమతుల్యంగా అందించడం ద్వారా బలమైన మొక్కలు, ఎక్కువ పిలకలు, ఆరోగ్యకరమైన కంకులు, మెరుగైన గింజ నింపుదల సాధ్యమవుతాయి.

సేంద్రియంతో నేల ఆరోగ్యం

పంట అవశేషాలను కాల్చివేయకుండా వాటిని నేలలో కలపడం, పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. దీనివల్ల పోషకాల లభ్యత మెరుగుపడి, నేల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలంలో రసాయన ఎరువులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.

నీటి యాజమాన్యం ముఖ్యం

సూక్ష్మ పోషకాల వినియోగంతో పాటు నీటి యాజమాన్యంపై కూడా రైతులు దృష్టి పెట్టాలి. పొలంలో ఎల్లప్పుడూ అధికంగా నీరు నిల్వ ఉంచకుండా, పంట అవసరానికి అనుగుణంగా నీటిని అందించడం ద్వారా వేర్ల అభివృద్ధి, పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుపడతాయి. నీటి వృథాను తగ్గించడం ద్వారా సాగు ఖర్చును కూడా నియంత్రించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement