డీజే అనుమతుల కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డీజే అనుమతుల కోసం ఆందోళన

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

డీజే అనుమతుల కోసం ఆందోళన అనాథ వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ముదినేపల్లి రూరల్‌: వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే బాక్సుల ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు, మహిళలు ఆందోళన చేపట్టారు. మండలంలోని వడాలి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించే ఊరేగింపులో డీజే పెట్టుకునేందుకు అనుమతించాలని యువకులు కోరగా, గతంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు తిరస్కరించారు. దీంతో పెద్దఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఏపీ టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొడాలి వినోద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని యువకులు, ఎస్సై వీరభద్రరావుతో చర్చలు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, పోలీసుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు నిర్వహించుకునేలా ఒప్పందం కుదరడంతో ఆందోళన సద్దుమణిగింది.

టి.నరసాపురం: మండలంలోని వీరభద్రవరం గ్రామంలో వీరంకి సాయి వద్ద ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధుడు ముంతాల మోహనరావు మృతి చెందగా, కామవరపుకోట సహాయ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం దహన సంస్కారాలు నిర్వహించారు. మోహనరావుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో, 20 సంవత్సరాల క్రితం వీరభద్రవరం వచ్చి సాయి కుటుంబంతోనే ఉంటున్నారు. ఆయన మృతి చెందడంతో మానవతా సంస్థ వారి శాంతి రథంలో మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం హిందూ స్మశానవాటికకు తరలించారు. సహాయ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరమల్ల మధు, వీరంకి సాయి ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. దహన సంస్కారాలు పూర్తి చేసిన మధు, సాయిలను స్థానికులు అభినందించారు.

తణుకు అర్బన్‌: గోస్తనీ కాలువలో గల్లంతైన కొచ్చెర్ల పద్మ తులసి (53) మృతదేహం శనివారం లభ్యమైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కాలువలో ఆమె మృతదేహం లభ్యంకాగా, పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ నిమిత్తం తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెక్కా వారి వీధిలోని తన నివాసానికి సమీపంలో ఉన్న కాలువ మెట్లపై శుక్రవారం ఎప్పటిలాగే తులసి బట్టలు ఉతుకుతుండగా పెద్ద ఎత్తున కోతుల గుంపు వచ్చి అడ్డంగా నిలబడడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలువలో జారిపడి గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల కేకలతో ఆమె కుమారుడు సతీష్‌ వెంటనే కాలువలోకి దూకి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రయత్నంలో సతీష్‌ కూడా నీటిలో మునిగిపోతుండగా, కిరణ్‌ అనే వ్యక్తి అతడిని ప్రాణాలతో రక్షించారు.

పాలకొల్లు సెంట్రల్‌: వెనుకనుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం..స్థానిక అంజలి మానసిక పాఠశాల వ్యవస్థాపకుడు విడివి ప్రసాద్‌ కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌ వద్దకు వచ్చేసరికి మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా వెనుక నుంచి ఢీకొట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలుకాగా స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పట్టణ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టినట్లు ప్రసాద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement