కుక్కునూరు: మూడు రోజుల క్రితం పెద్దరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన పాలరాజు (16) మృతదేహం శనివారం లభ్యమైంది. పాలరాజు గల్లంతైనప్పటి నుంచి పోలీసులు, గజ ఈతగాళ్లు, స్థానికులు గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వేలేరుపాడు మండలం తాటుకూరు గొమ్ము రేవు వద్ద శనివారం అతడి మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాలరాజు మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
భీమవరం: పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఉన్న మిల్క్‌సెంటర్ షాపులో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జె భానుప్రసాద్‌కు చెందిన మిల్క్‌షాపులో గ్యాస్ స్టౌపై పాలు కాస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై అగ్రిమాపక కేంద్రానికి సమాచారం రావడంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి మంటలను అదుపుచేశారు. ఈ ప్రఽమాదంలో మూడు ఫ్రిజ్‌లు కాలిపోగా సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని చెప్పారు.
పెంటపాడు: రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలైన ఘటన ముదునూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ముదునూరు గ్రామంలోని అరుంధతీపేటలో శుక్రవారం గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని బాలుడు మెరిపే దానియేలు (8)కు గాయాలయ్యాయి. బాలుడ్ని గూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఉషాభారతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
తాడేపల్లిగూడెం: పట్టణంలోని తణుకు బస్టాండ్‌లో 70 సంవత్సరాల వయస్సు కలిగిన యాచకుడు ఒకరు శనివారం మృతి చెందారు. ఏడాది కాలం నుంచి ఇదే ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటున్నాడని, వివరాలు తెలిసిన వారు పట్టణ పోలీసులకు తెలియచేయాలన్నారు.


