కుక్కునూరు: మండలంలోని పెదరావిగూడెం పుష్కర్‌ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తుండగా అల్లిగూడెం గ్రామానికి చెందిన బూరం పాల్రాజ్ (16) గల్లంతయ్యాడు. పాల్రాజ్ తన స్నేహితులు తానికొండ సతీష్, మద్దిబోయిన మణికంఠ, పేకేటి బాబితో కలిసి గురువారం మధ్యాహ్నం పెదరావిగూడెం శివాలయానికి వెళ్లి, అనంతరం సుమారు 3.30 గంటలకు పుష్కర్‌ఘాట్‌కు చేరుకున్నారు. పాల్రాజ్, మణికంఠ గోదావరిలో స్నానానికి దిగగా, మణికంఠ కొద్దిసేపటికి బయటకు వచ్చాడు. పాల్రాజ్‌ను కూడా బయటకు రావాలని కోరినా రాకపోవడంతో నీటిలో గల్లంతైనట్లు గుర్తించామని స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలవరం (రూరల్): పోలవరం మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వింజరం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా, అదే గ్రామానికి చెందిన గుగ్గులోతు కాంతమ్మ (62) అనే మహిళా కూలీ పని ప్రదేశంలో ఒక్కసారిగా గుండెపోటు, ఫిట్స్‌తో తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయింది. తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను వింజరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే కాంతమ్మ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ అకస్మాత్తు ఘటనతో వింజరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఏపీవో వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తణుకు అర్బన్: తణుకు డివిజన్ పరిధిలోని 10 మండలాల ఉన్నత పాఠశాలల గ్రీన్ టీచర్లకు స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పర్యావరణ కార్యక్రమాల నిర్వహణపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ రవీంద్ర ప్రకృతి కనెక్ట్ యాప్‌లో కార్యక్రమాల వివరాల అప్‌లోడ్‌తో పాటు ఈ విద్యాసంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచి సుస్థిర జీవనశైలిని అలవరచడంలో గ్రీన్ టీచర్లు శ్రద్ధ వహించాలని హెచ్‌ఎం నాగ పద్మావతి సూచించారు. ఈ కార్యక్రమంలో జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ కోడిగుడ్ల గుల్లలతో కాల్షియం పౌడర్ తయారీ ప్రదర్శన ఇవ్వగా, క్లస్టర్ కోఆర్డినేటర్ బీఎం గోపాలరెడ్డి ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. క్లస్టర్ కోఆర్డినేటర్లు నాగలక్ష్మి, సుకుమార్, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగి అదృశ్యంపై కేసు
భీమవరం: పట్టణంలోని 28వ వార్డు రామకృష్ణ నగర్‌కు చెందిన చింతలపాటి రామరాజు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన రామరాజు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార నిమిత్తం రెండు నెలల క్రితం నర్సీపట్నం వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగి రాలేదు. బంధువు వేగేశ్న వెంకట సుబ్బరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


