జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా
నూజివీడు: రైతులు వ్యాపారులు మామిడి, పామాయిల్ తోటలలో శ్రీప్లాకోబుట్రాజోల్‌శ్రీ (కల్తార్/నీరియా/కల్ట్/ప్లాకో)ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని, దీనివల్ల ఆయా తోటల్లోని చెట్ల జీవనశైలి దెబ్బతిని, పెరుగుదల నిలిచిపోతుందని ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని శ్రీ బాలాజీ ట్రేడింగ్ కంపెనీ, హోసన్నా ట్రేడర్స్ దుకాణాలను సందర్శించి, ప్లాకోబుట్రాజోల్ అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రసాయనాలను ఉపయోగించడం వల్ల చెట్ల పెరుగుదల నియంత్రించబడి, అధిక పూత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంతేగాక, ఇది మొక్కల్లో శ్రీజిబ్బరెల్లిక్ ఆసిడ్‌శ్రీ తయారీని అడ్డుకుంటుందని తెలిపారు. దీంతో మొక్కలు, చెట్ల జీవ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడి అవి దెబ్బతింటాయన్నారు. ఈ మందు వాడకం వల్ల కణ విభజన తగ్గి, ఆ శక్తి పునరుత్పత్తికి మళ్లడంతో త్వరగా, మరింత ఎక్కువ పూత వస్తుందని వివరించారు. ఈ మందును ఉపయోగించడం వల్ల రావలసిన సమయం కంటే దాదాపు రెండు నెలల ముందే పంట కోతకు వస్తుందని తెలిపారు.
మోతాదు.. వాడే పద్ధతి
మామిడి పంటలో 7–15 సంవత్సరాల వయస్సున్న చెట్లకు 15 మి.లీ. మందు, 16–25 సంవత్సరాల వయస్సున్న చెట్లకు 20 మి.లీ. మందు, 25 సంవత్సరాలకు పైబడిన చెట్లకు 25–40 మి.లీ. మందును 10 లీటర్ల నీటిలో కలిపి, మామిడి చెట్టు కాండం నుంచి 30 సెం.మీ. దూరంలో, 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో నేలలో ఉపయోగించాలని సూచించారు. సిఫారసు చేసిన దానికంటే ఈ మందును ఎక్కువ మోతాదులో వాడకూడదని, అలా వాడితే స్వల్పంగా దిగుబడి పెరిగినా, భవిష్యత్తులో మామిడి పంటపై తీవ్ర ప్రభావం పడి చెట్లు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మందును ఉపయోగించాలనుకునే రైతులు తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారి లేదా ఉద్యాన అధికారి సూచనల మేరకే వినియోగించాలని కోరారు. వ్యవసాయ అధికారులు పలగాని చెన్నారావు, బండారు శివశంకర్ పాల్గొన్నారు.


