ఏలూరు టౌన్ : ఏలూరు చొదిమెళ్ళ సాయికృష్ణానగర్‌లో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడిన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కే.రామకృష్ణ వివరాలు వెల్లడించారు. చొదిమెళ్ళ సాయికృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న భూరుగుపల్లి నాగబాబు కుటుంబసమేతంగా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈనెల 5న గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడి పట్టివేత
ఈనెల 17న పక్కా సమాచారంతో ఏలూరు నగరంలో నుంచి చింతలపూడి వెళ్లే రోడ్డులోని స్వాతి పెట్రోల్ బంకు సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మోటార్ సైకిల్‌పై వస్తున్న నిందితుడు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు చోరీల గుట్టు రట్టయింది. ఏలూరు చేపలతూము సెంటర్, సత్య టిఫిన్ సెంటర్ ఎదురుగా నివాసం ఉంటున్న మిత్తిరెడ్డి సురేష్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కింగువ గ్రామానికి చెందిన సురేష్, గత కొద్దికాలంగా ఏలూరులోనే నివాసం ఉంటున్నాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుడి నుంచి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేసులో చిన్నపిల్లల చైన్లు 2, నల్లపూసల తాడు 1, చిన్న ఉంగరం 1, పెద్ద ఉంగరాలు 3, కలశం చెంబు, వెండి అన్నప్రాసన గిన్నె 1, వెండి గ్లాసులు 2, వెండి స్పూన్లు 2, గంధం గిన్నెలు 2, ఒక శామ్‌సంగ్ టీవీతో పాటు నేరానికి ఉపయోగించిన యాక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును విజయవంతంగా ఛేదించిన ఏలూరు వన్‌టౌన్ సీఐ కే.రామకృష్ణ, రూరల్ ఎస్సై వీ.వెంకటేశ్వరరావు, ఎస్సై నాగబాబు, హెచ్‌సీలు సీతారామస్వామి, రమేష్, కానిస్టేబుళ్లు నాగరాజు, రాంబాబులను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.


