చింతలపూడి : తిమ్మిరెడ్డిపల్లిలో ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని, ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గ్రామానికి చెందిన పామర్తి నాగేశ్వరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు 3.5 కాసుల బంగారు పుస్తెలతాడును క్షణాల వ్యవధిలో లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సతీష్ కుమార్ గురువారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


