అథ్లెటిక్స్‌లో తల్లీకుమార్తెల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో తల్లీకుమార్తెల ప్రతిభ

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

అథ్లెటిక్స్‌లో తల్లీకుమార్తెల ప్రతిభ గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి రేషన్‌ బియ్యం పట్టివేత

ద్వారకాతిరుమల: రాష్ట్రస్థాయి 44వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం హైస్కూల్‌ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పైడి రాజేశ్వరమ్మ ప్రతిభ కనబరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 60 ప్లస్‌ విభాగంలో 5 కిలోమీటర్ల నడక పోటీలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అలాగే 100 మీటర్ల రన్నింగ్‌, షాట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్స్‌ కై వసం చేసుకున్నారు. రాజేశ్వరమ్మతో పాటు ఆమె తల్లి పైడి సత్యావతమ్మ కూడా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. 80 ప్లస్‌ విభాగంలో 5 కిలోమీటర్ల నడక పోటీలో గోల్డ్‌ మెడల్‌, 100 మీటర్ల రన్నింగ్‌, షాట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. తల్లి, కుమార్తె కలిసి రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. రాజేశ్వరమ్మను బుధవారం యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి దేవానంద్‌, మండల అధ్యక్షుడు జయరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్‌.శేషుకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.

పెనుమంట్ర: నత్త రామేశ్వరం (పంపాను వారి పాలెం) పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు పెనుమంట్ర ఎస్సై కే. స్వామి బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి సుమారు 42 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తిని ఒక వాహనం ఢీకొట్టి, రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకుపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని గమనించిన ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94407 96682 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

లింగపాలెం: భోగోలు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. గ్రామంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ధర్మాజీగూడెం ఎస్సై కె. వెంకన్న తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో, గ్రామానికి చెందిన చలమాల జోషి ఇంటి వద్ద వ్యానులో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన దాదాపు 3 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఆ బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement