తణుకు అర్బన్: తేతలి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మణికంఠ (35) బుధవారం తేతలి జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఎదురుగా వచ్చిన స్కూటర్ ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన మణికంఠ డివైడర్‌పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. తేతలి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మహీంద్రా కార్ షోరూమ్‌లో సర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్న మణికంఠ.. బుధవారం షోరూమ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కూతవేటు దూరంలో ఉన్న షోరూమ్ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం తోటి ఉద్యోగులను కలచివేసింది. మృతుడు నాగిరెడ్డి మణికంఠ నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మణికంఠ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆసుపత్రి వద్దకు వచ్చి మణికంఠ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.


